వాక్య యోజనయందు వారు పోయిన పోకడలు అనంతములు.
సామాన్యుల రచననుండి కవిశేఖరుల రచనలను శృంగగ్రాహికగా పట్టిచూపునది వారి అలంకారిక భాష. కవివర్యులు విశేషముగ రూపకభాషపై (Metophorical language) మక్కువ చూపుచుందురు. శ్రీ దాసుగారు ఇట్టి భాషను నైజలక్షణముగ ప్రయోగించిరనుటకు "దొరగారు సంగీతకుఠారము; పెద్దయుజ్జీ నోడించుట సైంధవవధ; అక్కన్న మాదన్నగారలు వచ్చారండీ; నిమ్మకొయ్యజాతి గనక చొరవ మెండు; దాసుగారి పాట దేవదుందుభులు మ్రోగెను; నీవు గుడాకేశుడవయ్యా!; పేరన్న కట్టి; నేపల్ల” (చుఱుకైనవాడు, బరువు మోయువాడు) వంటి రూపకభాషా ప్రయోగములు నిదర్శనములు.
“ఏ యెండ కా గొడుగు పట్టనివాడు కష్టముల పాలగును గదా! పుణ్యాత్ములకు లాతి వారి దోషములు గన్నింపవు గదా! కొలను నుండి కొండకేగిన కలహంసది తప్పుగాని కాకిది తప్పా?" వంటి అర్థాంతరన్యాస నిదర్శనాలంకార శోభితమైన భాష శ్రీ దాసుగారి రచనకు కావ్యత్వమును కొంతగ కల్పించినది. ఇందలి తుదివాక్యము వ్యంగ్యోక్తికిని, చమత్కారమునకును నిదర్శన మగుచున్నది. "ఆకసమున తామరలు మొలుచునా?" వంటి నిదర్శనాలంకారములును వీరి రచనకు శోభ నిచ్చినవి.
“నా కండవాతజాడ్యము ననుగ్రహించిన వెలయాలు, గొట్టాలమ్మ (కలరా) వేంచేయు, ఏ పుణ్యాత్ముడో నా గావంచా కాజేసెను; విజయనగరమున హుక్కాసువాసన తప్ప మిగిలిన దెల్ల దుర్వాసన. అతడు నేర్పిన విద్య యెట్లున్నను మప్పిన చుట్ట శాశ్వతమాయెను. ఏకాక్షి త్రితయ (సబ్ మేజిస్ట్రీటు, అతని భార్య, అతని కుక్క) మొక్కచో ప్రోగయ్యెను” - మొదలైన ప్రయోగములు వ్యంగ్యచమత్కారయుతములై దాసుగారి పరిహాసచతురతకు సాక్ష్యములుగ నొప్పినవి. వారు క్లబ్బులో ప్రవేశించునపుడు “Love fifty” అను కేకలు వినిపించె ననుటయు, భీముడుగారి వేశ్యాశోధనము ముగిసిన పిమ్మట "నీతో పొందు చింత కాయ" అనియు, వైష్ణవమిత్రుల యింట పెద్దగురుసేవ చేయునపుడు "ముండదేవుడు కుదిర్చెను కదరా ముగ్గుర నొకమారు” అను పాటను కల్పించి పాడుటయు నిట్టి చమత్కార విశేషములే.
శ్రీ నారాయణదాసుగారి భాషయందలి వైశిష్ట్యము విశేషముగ వారి ఉపమాప్రయోగమునందు కన్పట్టుచున్నది. వారి ఉపమలలో నూటికి తొంబది పాళ్లు స్వోపజ్ఞములు. ఇవి బాహ్యాంతరికములైన విశాల ప్రపంచములను తమయం దిముడ్చుకొని శ్రీ దాసుగారి నిశిత భావనాశక్తిని, సంస్కృతీవిలసనను వెల్లడించుచు
466
వావిలాల సోమయాజులు సాహిత్యం-4