లైంగిక మనస్తత్త్వవేత్తలు (Sex Psychologists) దర్శించి 'యూనిసెక్సు' అని వ్యవహరించుచున్న జీవ రహస్యమును, ప్రాణికోటియందలి 'యక్సు, వై' క్రోమోజోముల సంయోగ స్వరూపములు దర్శించిన ఆధునిక జీవ శాస్త్రజ్ఞుల (Biologists) పరిశీలనమును శ్రీ దాసుగారు ఎన్నడో గ్రహించుట ఆశ్చర్యకరమైన విశేషము!. “పరమపురుషుడు తప్ప పురుషుడు లేడు. చెరిసగము స్త్రీ పుంస్త్వములున్నవి. కనుకనే సంయోగాపేక్ష, నిండు మగవాడు శివునివలె కామశత్రువు" - ఇట్టి గభీరసత్యములను 'నా యెఱుక' యందు శ్రీ దాసుగారెన్నింటినో వెల్లడించినారు.
శ్రీ దాసుగారికి దేశమన్నను దేశీయ ప్రభువులన్నను, దేశీయ స్వాతంత్య్ర మన్నను అమిత గౌరవాభిమానము లున్నవి. 'గంధర్వమానవుడ' నని చెప్పుకొనుచు సంగీత సాహిత్యసభలతో కాలముగడుపుచున్నను, శ్రీ దాసుగారు దేశాభివృద్ధిని గూర్చి యోజనయొనర్పకపోలేదు. ఉద్యోగులైనవారు దేశీయ ప్రభువులును ప్రజాసంక్షేమ కరములైన కార్యకలాపము లొనర్చుటకు ప్రోత్సహించుటలేదని వారు ఆక్రోశించినారు. దేశీయులు వ్యవసాయము, వర్తకము అభివృద్ధి చేసికొనవలెగాని సాంఘిక సంస్కరణలపై దృష్టిని నిలిపి, కాలమును వ్యర్థపుచ్చరాదని వారి భావము. అందువలననే “శిరస్సు లేని మొండెమున కభ్యంగన మొనర్చినట్లు స్వాతంత్య్రము లేని దేశమునకు సోషల్ కాన్ఫరెన్సు ఏలా? డాబులు చేయుటకు టప్పాలు కొట్టుకొనుటకు" అని శ్రీ దాసుగారు “నా యెఱుక” యందు అభిప్రాయపడిరి.
8
“నా యెఱుక” యందు శ్రీ దాసుగారి విషయకథనము, సన్నివేశ చిత్రణము, సంభాషణవిరచనము, వర్ణనాదులందు రసానుగుణము, ఔచిత్యశోభితమునైన సారవద్భాషను ప్రయోగించినారు. వీరి భాష ప్రసన్నమధురము చమత్కార విస్ఫురితము సూక్తి సుధావిలసితము. శ్రీ దాసుగారి శిష్టభాష ఎడనెడ వ్యంగమర్యాదలతో, ఆలంకారిక వైభవముతో విలసిల్లుచు “నా యెఱుక” కు కావ్యత్వమును సిద్ధింపజేయుటకు అధికముగ తోడ్పడినది. శ్రీ దాసుగారు అచ్చ తెనుగుపై ఇంచుక విశేషానురాగము కలవారైనను ఉచితజ్ఞులై, “నా యెఱుక” స్వీయచరిత్ర రచనమునందు తత్సమ అచ్ఛిక పద సంకలితమైన “ఆంధ్రభాష”పై మక్కువ వహించుట మెచ్చదగియున్నది. 'నా యెఱుక' యందలి భాష నుడికారపు సొంపులతో, జాతీయపుటింపులతో జీవవంతమై సాహిత్యలోకమునకు ఆదర్శముగ నొప్పియున్నది. శ్రీ దాసుగారి జీవితమువలెనే వారి శబ్దకోశము అతి విస్తృతము; సర్వతోముఖము; శక్తిమంతము; సంస్కృతీప్రదర్శకము.
సాహిత్య విమర్శ
465