Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాగుచుండెడిది. శ్రీ దాసుగారు “నా యెఱుక" యందు దాని నిట్లు తమ నైజమగు పరిహాసచతురతతో వెల్లడించినారు : "గవర్నమెంటు నౌకరు మొదట గౌరవనీయుడు. అందు క్రిమినల్ అధికారి శ్రేష్ఠుడు. సివిలు రెండవ రకము. మా వైపు భోజనము చేయువేళ ఫష్టుక్లాసు పంక్తిలో మొదటి విస్తరి డిప్యూటీ కలెక్టరుగారు తరువాత సిరస్తాదారుగారు తరువాత సబ్ మేజిస్ట్రీటుగారు తరువాత మునసబుగారు తరువాత ఇనస్పెక్టరుగారు తరువాత హెడ్ గుమాస్తాగారు తరువాత నాజరుగారు తరువాత ప్లీడరు తరువాత చిల్లర గుమాస్తాలు. రెండవ క్లాసు పంక్తిలో జీతమునుబట్టి తరగతిగా జమీందారీ యుద్యోగులు. మూడవక్లాసు పంక్తిలో స్కూలు మాస్టర్లు, పిదప దిక్కుమాలిన పంక్తిలో పండితులు, వైదికులు. కొట్టకొసకు గాయకులు, భిక్షుకులును.”

శ్రీ దాసుగారు నాటిదేశీయ ప్రభువులు మొగదాళ్ళు త్రిప్పుట వంటి వ్యాయామ విశేషములు, బ్రాహ్మణుల భోజనపరాక్రమము, వేశ్యల కపట నటనాకౌశలములు మొదలగు విశేషములను, ఉచితభాషలో సందర్భానుసారముగ తమ ఆత్మకథ యందు నిబద్ధమొనర్చినారు.

శ్రీ నారాయణదాసుగారు ఐహిక ఆముష్మికములైన భారతీయ సాహిత్య గ్రంథములతోను, ఆధునిక సంస్కృతితోను గాఢపరిచయ మబ్బుటవలన నెలకొనిన ఉత్తమము, విపులమునైన దృక్పథము గలవారు. జీవహింస, అనృతములను పాపములంటనివారు. విహంగమన్యాయమున జీవింప నిశ్చయించుకొని కేవలము ఆత్మానందమునకై విద్యార్జన మొనర్చినవారు. తాత్కాలికదృష్టితో కాక నిత్య సౌఖ్యావహమైన నిర్మల చిత్తవృత్తితో తమ పరిసరములందలి సంఘమును గాఢముగ పరిశీలన యొనర్చినవారు. తాము దర్శించిన గుణదోషములను వెఱ పెఱుగక వెల్లడించినవారు. శ్రీ దాసుగారు అతివిస్తృతమైన తమ యనుభవమును పురస్కరించుకొని బాల్యయౌవనములు, స్త్రీ పురుష విభేదములు, మిత్ర శత్రుత్వములు, సజ్జనత్వ దుర్జనత్వములు మొదలగు వానిని గూర్చిన పరిశీలనల నెన్నింటినో 'నా యెఱుక' యందు వెల్లడించినారు. శ్రీ దాసుగారు నెల్వరించిన భావములతో ఆధునికులు కొన్నిటితో నేకీభవింతురు. వర్ణవ్యవస్థ, స్త్రీ స్వాతంత్య్రం , స్త్రీ పునర్వివాహము మొదలగు కొన్ని సందర్భములయందు ఆధునికులు వారిని ఛాందసులుగా పరిగణించెదరు.

"పురోడాశమును రుచిమరిగియే కాబోలు పున్నమల కమావాస్యలకు ఇష్టి జరుపుచుందురు. క్రిష్టియానిటీకి అన్యమతస్థులయెడ దయ లేదు. బ్రహ్మసమాజము


సాహిత్య విమర్శ

463