కలహంసది తప్పుగాని కాకిది తప్పా!" అను రీతి మందహాస సుందరముగ పలికి లోగొని, దాసురాండ్ర గావించుకొను నేర్పునందు దాసుగారు కడుదక్షులు. వీరి సంభాషణయందలి పరిహాసచాతుర్యమునకు "శారద చంద్రికా!” యందు తప్పు పట్టిన శ్రేష్ఠిగారితో నొనర్చిన సంభాషణము నిదర్శనము. ఇట్టి సమయస్ఫూర్తి, సంభాషణ రాసిక్యములు శ్రీ దాసుగారికి విద్యాజైత్రయాత్రలందు ప్రముఖ సాధనములైనవి.
శ్రీ దాసుగారికి అపూర్వ వ్యక్తిత్వమును ఆర్జించియిచ్చిన విశేషములలో ప్రథమగణ్యములైనవి విజ్ఞాన పాండిత్యములు. 'నా యెఱుక' యందు “అంబాశబ్దమే నిశ్చయముగ “ఓమ్' అని పరిణమించెను. అంబా శబ్ద వివర్తరూపమే సర్వజగత్ప్రకృతి” ఇత్యాదిగా ప్రదర్శించిన యోజన వారి విజ్ఞానగంభీరత కొక చిన్న తార్కాణము. వారి సంగీత సాహిత్య వైదుష్యములు సహజసిద్ధములు. సచేతనములు. సృజనాత్మకములు, బహుముఖీనములు, నవనవోన్మేషములు. బహువిధమైన అంతస్తులతో గూడిన జన జీవితములతో పరిచయము గల శ్రీ దాసుగారి లోకజ్ఞత అతివిపులము నిశితము, గభీరము, ఇట్టి ప్రతిభావ్యుత్పన్నతలతో వారు, లోకమే విశాల కళాశాలగా, తామొక విశిష్ట సంచార విశ్వవిద్యాలయమై విద్యాప్రదాన ప్రబోధము లొనర్చి ధన్యులైనారు. శ్రీ దాసుగారు ద్రష్టలు, స్రష్టలు, ఉపదేష్టలు.
సంస్కృతాంధ్రాంగ్ల ఉర్దూ పార్శీ అరబ్బీ భాషాకోవిదులైన శ్రీ దాసుగారు, ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలనెల్ల స్వయంకృషితో నార్జించిరి. సంగీతము నందును వీరు గురుశుశ్రూష వలన సంపాదించిన దల్పము. కావుననే వారు “నా సంగీత సాహిత్యములు సహజసిద్ధము”లని నిస్సంకోచముగ ప్రకటించినారు. కుశాగ్రబుద్ధులైన శ్రీ దాసుగారికి పండిత పామర జనరంజనమునందు ఏకసంథాగ్రాహిత్వము ఎన్నియో రీతుల తోడ్పడినది. బాటసారి, ఉమర్ ఖయ్యాము వంటి కావ్యరచనలతోను, అనన్యసాధ్యమైన హరికథారచనలతోను అపూర్వ సాహిత్యస్రష్టలనిపించుకొనిన శ్రీ దాసుగారు, హరికథాకాలక్షేప వేళల ప్రహ్లాద నారద పరాశరాది మహాభక్త కోటిలోని వారన్న ప్రఖ్యాతిగడించినారు. ఔత్తరాహ, దాక్షిణాత్య సంగీత విద్వాంసులలో నెంతటివారినైన మెచ్చని శ్రీ దాసుగారు, పరమేశ్వరదత్తములైన శ్రుతిలయ త్రిస్థాయి గౌళగాత్రముతోను, అన్యు లంచులనైన అందుకొనజాలని లయజ్ఞానముతోను సంగీత సభలలో అనన్వయా లంకారమునకు ప్రథమలక్ష్యముగ విలసిల్లినారు. సంగీత సాహిత్యములకు సమప్రాధాన్య మిచ్చుచు వీరు కావించిన నానావిధములగు అష్టావధానములు అన్యులకు దుర్ఘటములు. 1. రెండు పాదముల రెండు తాళములు, రెండు చేతులు రెండు తాళములు వేసి పల్లవి పాడుచు కోరిన జాగాకు కోరిన ముక్తాయిలు
సాహిత్య విమర్శ
461