Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇట్లే శ్రీ దాసుగారికి తమ మనసు కెక్కిన విద్వాంసులను, రసజ్ఞులను, ఉదారవదాన్యులను సముచితరీతి ప్రశంసించు టాచారము. ఉపమోత్ప్రేక్షాదులతో నొప్పు వీరి పొగడ్తలు ఎంతటి ఘనులకోకాని దక్కెడివి కావు. మహమ్మదీయగాయకుని గంధర్వులను మెప్పింపజాలిన మేటి గాయకుడని మెచ్చుకొనుటయు, పదిసవరుల బంగారు కంకణములను చేతనుంచి ప్రార్థించి పల్లవిపాట విన్న వైశ్యోత్తముని రసిక శేఖరుడనియు ప్రశంసించుటయు వీరి గుణగ్రహణ పారీణత కులమత విచక్షణల కతీతమైనదని అభివ్యక్త మొనర్చుచున్నది. ఆడంబరత్వ, దౌష్ట్యములను శ్రీ దాసుగారు సహింపలేరనుటకు బిల్వేశ్వరీయకర్తను 'అమృతప్రవాహముగ నుపన్యసింప జాలినవా'డని పొగడిన వీరు విచిత్ర వివాహకర్తను తెగడుటయు, వీరి రచనలను స్వీయ రచనలుగా రాజుగారి యెదుట ప్రకటించుకొన్న డిప్యూటీ కలెక్టరును 'నేను ద్రావిడుడను. నీ దౌష్ట్యమును అడిగినవారికి అడగనివారికి తప్ప నింకెవ్వరికిని చెప్ప' నని ఛలోక్తి సహితముగ ధైర్యముతో బెదరించుటలు నిందుకు తార్కాణములు.

బహిరంగముగ ప్రకటించుకొనుట లోక మంగీకరింపని స్త్రీ లౌల్య 'గురు' సేవన వ్యసనములను సభలలో వెల్లడించుటయే కాక, కలకాలము నిలిచిపోవునట్లు తమ స్వీయచరిత్ర కెక్కించుట శ్రీ దాసుగారి సత్య ప్రియత్వమునకు నిస్తుల నిదర్శనము. లోభరహితులైన వీరికి యాచాదైన్యము లేదు. ఆత్మాభిమాన, దైవపరత్వములు గల శ్రీ దాసుగారిని తెలియక ఎంతటి వదాన్యులైన 'ఏమి కావలయునో కోరుకొ" మ్మనినపుడు వారికి 'పరమేశ్వర కటాక్షముకంటె కోరదగిన దేదియును లేదు' అని రేవారాణి పొందిన సమాధానమే వచ్చితీరును, విద్యాపరీక్షణ మొనర్చి, పిదప చిన్నచూపు చూచి, అల్పమిచ్చినచో యథాలాభసంతుష్టి జీవలక్షణముగా గలవారైనను శ్రీ దాసుగారు మోమోటపడక 'ఏదైన ఖర్చునకు వచ్చును మీరే ఉంచుకొను' డని తిరస్కరించుటకు వెనుదీసెడువారు కారు.

శ్రీ దాసుగారికి స్వతంత్ర జీవనాసక్తి చిన్ననాడే జితించినది. శ్వవృత్తి సమస్త శక్తుల నాహరించి దైవదూరులను, స్వలాభపరులను గావించునను విశ్వాసము కాలము గడచిన కొలదీ శ్రీ దాసుగారికి ప్రగాఢమైనది. విద్యాపరీక్షణమొనర్చి పరమానందము నొందిన పిమ్మట మైసూరు మహారాజావారు "సర్వీసు చేసెదవా?" అని ప్రశ్నించినపుడు శ్రీ దాసుగారు, క్షణమైన యోజింపక, “నేను మర్త్యులను గొల్వను" అని సమాధానమిచ్చి, వారిని కోపఘూర్జితనేత్రులను గావించుట వారికే తగియున్నది. తుదకు తమ హరికథలలో నొక్కదానినైనను నరాంకితము గావింపలేదని శ్రీ దాసుగారు


సాహిత్య విమర్శ

459