Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీడి, జీవన్ముక్తుని వలె మధురోహలతో వీరు బాల్యమున ఊహాలోక విహరణమొనర్చిరి. ఏదియో గొప్పపని చేయవలయునను సంకల్పము, చేయగలనను విశ్వాసము శ్రీ దాసుగారికి చిన్ననాడే అబ్బినవి.

సహవాసదోషమువలన యౌవనారంభవేళనుండి శ్రీ దాసుగారికి స్త్రీ, 'గురు' సేవన వ్యసనము లలవడినవి. అపురూపరూపము, శృంగార పురుష వేషము, బహిరంగ కామవ్యాపారము లిందుకు తోడైనవి. దేవదత్తములైన ప్రజ్ఞాపాండిత్య బలములతో గౌరవమునకు భంగమురాని రీతిగ వారెంత ప్రవర్తించినను, నడవడి విమర్శకు లోనగుచు వచ్చినది. అసమాన పాండిత్యము గురుజనరాహిత్యము, బ్రాహ్మణకర్మపై నాస్థ, యజ్ఞకలాప వైముఖ్యము, హరికథాప్రవిష్ణుత - విలాసవేషము, రాజాదరణవలననే గాని ఘనముగ రాణింపని విద్యలు - స్వచ్ఛంద ప్రియత్వము - లోకాధారజీవనము వెఱపులేని బహిరంగ వ్యక్తి విమర్శ, సహజ సౌజన్యము - నైజకలహశీలము ఇట్టి అసంబద్ధతలు (incongruities) కొట్టవచ్చినట్లు కన్నట్టుటవలననే, శ్రీ దాసుగారికి వీడ్కోలిచ్చువేళ కంటతడివెట్టు కామేశము పంతులు కారణమడుగగా “సూరన్నా! లోకమెట నిన్నపార్ధ మొనర్చుకొని అగౌరవించునోయని చింతించుచున్నా' ననవలసి వచ్చినది.

యౌవనదశలో కొంతకాలము తఱుచుగ గురుసేవలో నుండుటచే నొదవిన అలక్ష్యబుద్ధితో, కథలొనర్చువేళ పిన్న పెద్దలనక అభిప్రాయములు చెప్పి తట్టాబాజీలు తెచ్చుకొనుట, యథేష్ట వేషభాషలతో అహంకరించి తిరుగుట శ్రీ దాసుగారికి లక్షణములైనవి. ఈ సందర్భములందు వీరు తమపని చెడుటనైన గమనింపరు. వీరు ఆత్మదోషములను సైతమల్లే ప్రకటించి విమర్శించుకొనిన వారు. ఉత్తమ మిత్రులైన వీరు హృదయమిచ్చి పుచ్చుకొన నేర్చినవారు. మిత్రవియోగము బాధ పెట్టినపుడు నైజముగ నిశ్చింతగలవారగుటచే హాయిగ నుండగలవారు. తమ్ము ఘనముగ నాదరించిన కామేశముపంతులు, భీముడుగారి వంటి గాఢమిత్రులకే కాక కృతజ్ఞతాబుద్ధితో శ్రీ దాసుగారు విద్యార్థిదశయందలి మిత్రులకును, చంద్రశేఖరశాస్త్రి వంటి గురువులకును స్వీయచరిత్రయందు స్థానమును కల్పించి, చిరంజీవత్వమును ప్రసాదించుట శ్రీ దాసుగారి ఔదార్యమునకు దొడ్డ నిదర్శనము. జీవితము దోషావిష్టము గావున పదునారేండ్ల వయసునకు మించిన, పూర్వపరిచితులవి తప్ప, మిగిలినవారి పేర్లను చెప్పనని నియమేర్పరచుకొని, పాటించుట శ్రీ దాసుగారి ఔచిత్యపాలనమునకు తార్కాణము.


458

వావిలాల సోమయాజులు సాహిత్యం-4