Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామణీయకములను పోషించునట్లు జాగరూకత వహింపవలయును. శ్రీ అజ్జాడవారు తమ జీవిత ఘట్టములను కథించునపుడు వానిని వ్యష్టిగాను, సమష్టిగను పోషించి, 'నా యెఱుక' యందు అంగాంగీభావ సంయోగమును సంపాదించి, సముచితమైన నిర్మాణ సౌందర్యమును (Structural Beauty) ప్రదర్శించినారు. కామేశముపంతులు ఔదార్యరసజ్ఞతలు, రామయ్య వీడ్కోలు, భీముడుగారి వేశ్యాశోధన, నరసన్న పేట వింత వేశ్య, బందరు అవధాన విశేషములు, గంగాధర రామారాయణింగారు చేసిన సన్మానము, మైసూరు జైత్రయాత్ర మొదలైన సన్నివేశములన్నియు నిందుకు సాక్ష్యములుగ నొప్పియున్న వనుట ఛిన్న సంశయము.

ఎట్టి కథకైనను రామణీయకమును కల్పించు నంశములలో ప్రధానమైనది అందలి పాత్ర చిత్రణము. పాత్రలు సందర్భోచిత వేషభాషాచేష్టలతో సజీవమూర్తులై పాఠకుల మనోముకురములందు సుందరముగ ప్రతిబింబితములై రూఢికెక్క వలయును. శ్రీ నారాయణదాసుగారి 'నా యెఱుక' లోని పాత్రలు సిద్దహస్తుడైన కవి గండరించిన, అమృతపాత్రలవలె సహజోక్త సుందరములై నిజరూపములతో నిత్యత్వము నార్జించుకున్నవి. ఇందలి ప్రధానమైన పాత్రయైన శ్రీ దాసుగారు, సహగాయకుడు పేరన్న, జయంతి కామేశము, భీముడుగారివంటి మిత్రులు, మహీశూర మహారాజు, పిఠాపురము మహారాజు గంగాధర రామారాయణింగారు, విజయనగర ప్రభువు ఆనందగజపతి వంటి వదాన్య శేఖరులు, రసజ్ఞశేఖరులే కాక మాటతప్పిన వేశ్య, భీముడుగారి వేశ్య, నరసన్నపేట వేశ్య మొదలైన వారును, ప్రాసంగికముగ కథలో ప్రవేశించిన వైష్ణవ సంగీత సాహిత్య విద్వాంసులు విచిత్ర వివాహకర్త, మదరాసు ఆంధ్రభాషోపన్యాసకుడు, డిప్యూటీ కలెక్టరు, శ్రీ దాసుగారి లయజ్ఞానమును తప్పుబట్టిన వైణికుడు మొదలైన వాఱెందరో “నా యెఱుక" లోని మరపునకు రాని పాత్రలు.

'నా యెఱుక'కు వింత సౌందర్యమును చేకూర్చిన విశేషములలో హృదయావర్జన మొనర్చుకొనగల వర్ణనసామర్థ్యమొకటి. "వర్ణనా నిపుణః కవిః" అని గదా! శ్రీ దాసుగారు సన్నివేశ చిత్రణమునందెంతటి సమర్థులో వర్ణనలందును నంతటి ప్రతిభావంతులు. శ్రీ దాసుగారి సన్నివేశములవలెనే, వర్ణనలును బహువిధ వైవిధ్యముతో నొప్పి వారి మేధానైశిత్యమును, విజ్ఞాన వివేకవిస్తృతులను, రసజ్ఞతారామణీయకతలను సర్వత్ర బహిర్గతము లొనర్చినవి. 'నా యెఱుక' లోని ప్రతి సన్నివేశమునందును నారాయణదాసుగారి వ్యక్తిత్వము కారణముగా నంతయో ఇంతయో వైచిత్రి ప్రవేశించినది. చిన్ననాడు రాజదుర్గయ్య పంతులు గారింట సాహసించి భర్తకై


456

వావిలాల సోమయాజులు సాహిత్యం-4