మొన్నటివరకు మనవారు చిత్తప్రవేశమును కల్పింపలేదు. అందుచే "పూర్వుల కంతగా రుచింపని” ఈ సాహిత్య ప్రక్రియాసృష్టికి భారతీయులకెట్లో ఆంధ్రులకు నట్లే పాశ్చాత్యులు మార్గదర్శకులు కావలసి వచ్చినది. పాత్ర సంశయములు కారణములుగా పాశ్చాత్యులందును సాహసికులైన ఏ స్వల్ప సంఖ్యాకులో తప్ప ఆత్మకథారచన నితరులాదరింపలేదు. అందువలన వారి దేశములోను జీవిత చరిత్రలవలె స్వీయచరిత్రలు పృథు సంఖ్యలో పుట్టలేదు. “I feel greatmen should tell the story of their lives., therefore I am telling mine" అన్నాడు మధ్యకాలమునాటి ఇటాలియను మహాశిల్పి సెలినీ. ఈ అభిప్రాయము స్థూలదృష్టికి అహంభావపూరితముగ తోచినను, ఒక చిరతరసత్యమును వెల్లడించుచున్నది. లోకోపకారబుద్ధితో చెప్పుకొన్న ఇతని స్వీయకథ శిల్పసాధకులకే కాక, సకల కళాజీవులకును దుర్గమ దేశములందు వెలుగుబాటలను జూపుచున్నది. తుదకు శృంగారశూరుడైన 'కాసనోవా' ఆత్మకథయును (Adventures of Casanova) మానవ మనస్తత్త్వమునకు మనోజ్ఞముకురమై చిత్తాహ్లాదనమును, జ్ఞానబోధనము నొనర్చుచున్నది. పాత్రలు స్వయముగ చెప్పికొనునవగుటచే ఇట్టి స్వీయ చరిత్రలు ఎట్టి శంకలకు తావీయక గాఢముగ విశ్వసింపబడుచు నధిక ప్రయోజనమును చేకూర్చుచున్నవి. 'నా యెఱుక' అనుపమములైన ఆత్మవిశ్వాస ప్రత్యయములు గల సర్వతోముఖ ప్రజ్ఞాశాలియగు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి ఆత్మ కథ. "లోకులచే నేనెఱింగినదియు, నాకు స్వయముగా తెలిసినదియు మదీయానుభూతి దెలుపగోరి యిద్దాని వివరించెద. బాల్యయౌవనదశలను గల యనుభవము నన్ను గూర్చియు, లోకము గూర్చియు నే దెలిసిన మట్టుకు వ్రాసెద" అని వారు స్వీయ చరిత్రను ఆరంభించినారు. ఈ వాక్యములను బట్టి వారు ఏ దృష్టితో స్వీయచరిత్ర రచనకు పూనుకొనునదియును, అందుకు వేనిని ప్రమాణములుగా గ్రహించినదియును తెలియుచున్నది. శ్రీ దాసుగారి అనుభూతిలో కొంత లోకులచే నెఱిగినదున్నది. ఇందధికభాగము బాల్యమునకు జెందినదై యుండును. వారు తమకు మూడేండ్ల వయసునుండియు కలిగిన జాగ్రత్స్వప్నానుభూతులలో మూడువంతులు జ్ఞప్తియందున్న వారు. స్వానుభూతి విజ్ఞానమును పరులనుండి విన్నదానితో సమన్వయ మొనర్చుకొని శ్రీ దాసుగారు ఆత్మ పరిచయ రచనమొనర్చిరన్నమాట! సంగీత సాహిత్య నాట్యావతారులైన శ్రీ నారాయణదాసుగారు ఆంధ్ర సరస్వతికి సమర్పించిన నవరత్నోపహారమిది. ఇది శ్రీ దాసుగారి అసాధారణ వ్యక్తిత్వ నికేతనమున
454
వావిలాల సోమయాజులు సాహిత్యం-4