లిట్టన్ స్ట్రాచీ 1918లో “ఎమినెంట్ విక్టోరియన్స్” రచనతో ఆధునిక జీవిత చరిత్రకు స్వయం సంపూర్ణత నొసగి సకల ప్రపంచసాహిత్యకుల దృష్టి నాకర్షించినాడు. ఇతడు పూర్వులవలె పాండిత్య ప్రదర్శనకై అసంఖ్యాకముగ పాత్రల జీవితాంశములను సేకరించి వెల్లడించుటయెడ మిక్కిలి మక్కువను ప్రదర్శింపలేదు. పాత్రల అంతరిక వ్యక్తిత్వమును తేజోవంతముగ బహిర్గత మొనర్పగల అల్ఫాంశములతోనే ఇతడు వ్యక్తిత్వోన్మీలన మొనర్చినాడు. సమకాలీన ప్రజలచే మానవాతీతులుగ పరిగణితులు, పూజితులునైన విక్టోరియా నాటి స్త్రీ పురుషశ్రేష్ఠులం దీతడు, సామాన్యులలో కన్పట్టు దోషములను సహితము దర్శించి వెల్లడించుటకు వెనుదీయలేదు. ఖారటూంవీరుని మద్యపాన వ్యసనిగను, కార్డినల్ మానింగును సదా భావవైక్లబ్యునిగను రూపొందించుట ఇందుకు నిదర్శనము. ఇతడు చిత్రించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రజానీకము ఊహాతూలికలలో మనోభిత్తికల పై తీర్చిదిద్దుకొన్న అశ్వినీదేవతలను బోలిన అమరకాంత కాదు; ధైర్యసాహసములతో ప్రబల ప్రభుత్వమును ప్రతిఘటించి, "సైనిక వైద్యసేవ" (Army Medical Service) యందున్న దోషములను తొలగించుటకై పోరాడి విజయమును చేకొన్న వీరనారి. స్ట్రాచీ పాత్ర లెల్లరు బలదౌర్బల్య గుణదోషయుతులైన మానవులే కాని అందీయందని ఛాయామూర్తులు గాని, దిగమగొల్పు తేజోమూర్తులు గాని కారు. స్వీయచరిత్ర రచనయందు నూతనశకారంభ మొనర్చిన ఈతని తరువాతి కృతియైన “క్వీన్ విక్టోరియా" యందును ఇతడు విక్టోరియా రాజ్ఞిని, ఆమె భర్తను, మెల్బోర్న్ ప్రభువు వంటి అగ్రవర్గముల వారినైనను ప్రదర్శించుటకు పూనుకొనలేదు. ఇతడు స్త్రీజననైజ దోషములైన ఆత్మప్రామాణ్యము, ప్రగల్భత, కార్కశ్యములతో విక్టోరియా రాణిని, అట్లే ఇతరదోషములతో ఆమె భర్తను, మెల్బోర్న్ ప్రభువును ప్రదర్శించినను ఈ పాత్రలు గాని, లోపయుతములుగ ప్రదర్శితములైన ఇతని ఇతర పాత్రలు గాని శోభారహితములని భావింపరాదు. ఇతని పాత్రలన్నియు పటిష్ఠములై పాఠకుల దృష్టి నాశ్చర్యకరముగ నాకర్షింప జాలియున్నవి. విచిత్రమైన ఒక విడంబన ధోరణి లేదా అవక్షేపధోరణి (Mocking strain) లిట్టన్ స్ట్రాచీ రచనారీతికి జీవాతువు. ఇతనినుండి ఉద్బోధమునొందిన ఆధునిక జీవిత చరిత్రకారులలో మటొక "క్వీన్ విక్టోరియా” చెప్పిన ఎడిత్ సిట్వెల్, శ్లాఘనీయముగ "అక్బరు"ను రచించి యిచ్చిన లారెన్స్ బినియన్, "పామెర్షన్" కృతితో ఘనవిజయమును గైకొన్న ఫిలిప్ గొయొడెల్లా ప్రముఖులు.
ఎమిల్ లుడ్విగ్ అను జర్మను జీవిత చరిత్రకారుడు, మహాపురుష వ్యక్తిత్వమును అసాధారణ భావనాశక్తితో ఒడుచుకొని, కవితోద్వేగము, అతీంద్రియతలను ఊతగా
సాహిత్య విమర్శ
451