Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినిర్మితమైన పంజరాకృతి నాధారముగ గ్రహించి, కళాకుశలుడై, నిత్యసౌందర్య పరిశోభితమైన జీవితప్రతిమను గండరింపవలయు నన్నమాట! జీవిత చరిత్ర ఇంతటి బృహద్భారనిర్వహణముతో గూడినదియు, క్లేశకరము, శ్రమసాధ్యమునైన దగుటవల్లనే అసిధారానృత్యమగుచున్నది. జీవిత చరిత్రలను గూర్చి యొనర్చిన ఈ జిజ్ఞాస స్వీయచరిత్రలకును అన్వయించుట సత్యము.

అత్యంత ప్రాచీన కాలముననే పాశ్చాత్య దేశములకు ప్రాచీన గ్రీకు రోమను జీవిత చరిత్రల నిబద్ధమొనర్చి యిచ్చిన గ్రీకు జీవితచరిత్ర కారుడుగు ప్లూటార్క్ మహాశయుడు (క్రీ.శ. 64-120) జీవిత చరిత్రకారులు పాటింపవలసిన ప్రధాన సూత్రములనెల్ల నిర్దేశించి యిచ్చినాడు. కాని అవి అతనితోనే విస్మృతములైనవి. జీవిత చరిత్ర రచన మరల మధ్యయుగమునందు పుణ్యపురుష జీవిత ప్రశస్తులతో (Panegyrics of Saints) పునః ప్రారంభమైనది.

అయినను 19వ శతాబ్దిలోని మహారచయితలైన జాన్సన్, బాస్వెల్, సథీ, కార్లయిల్, ప్రౌధే, మెకాలే, అబట్ల తీవ్రకృషి వలన గాని జీవిత చరిత్రకు ఒక సాహిత్యశాఖగా నెలవుకొను అవకాశము లభింపలేదు. ఈ రచయితలు తమ పాత్రల గుణములను మాత్రమే స్వీకరించి రచన సాగించుటవలన వీరు వ్రాసిన జీవిత చరిత్రలు వీర పూజను ప్రోత్సహించునవైనవి. ఈ జాతి జీవిత చరిత్రలకు కార్లయిల్ మహాశయుని “హీరో అండ్ హీరో వర్షిప్" చక్కని ఉదాహరణము. వీరి పాత్రలు భయగౌరవములను పొందగలిగిన దేవతాప్రతిమలైనవేగాని, సమకాలీన సహజీవనులైన ప్రజల అభిమానానురాగములను పొందలేకపోయినవి.

ఇట్టి స్థితినుండి 20 వ శతాబ్దమున పాశ్చాత్య జీవిత చరిత్రను సముద్ధరించి, పునరుజ్జీవమును కల్పించి, బహుముఖీన వైభవవికాసములను ప్రసాదించిన ఉత్తమ రచయితలు ఎ.జి. గార్డ్నర్, లిట్టన్ స్ట్రాచీ, ఎమిల్ లుడ్విగ్, ఆండ్రూమారా ప్రభృతులు. జీవిత చరిత్రల మూలమున విషయబోధన మొనర్చుటకంటే, చిత్తాహ్లాదమును చేకూర్చుటయే (delight than teach) ముఖ్యాశయముగా 'ప్రాఫెట్స్, ప్రీస్ట్స్ అండ్ కింగ్స్' (1908), 'పిల్లర్స్ ఆఫ్ సొసైటీ' వంటి ఉత్తమ జీవిత చరిత్రలను రచించి ఎ.జి. గార్డ్నర్ ఆంగ్ల దేశమున నూతన శకారంభ మొనర్చినాడు. లాయడ్ జార్జి మొదలు చార్లీ చాప్లిన్ వఱకుగల అపూర్వ వ్యక్తులను ఇతడు భయసంకోచములు లేక యథార్థరూపములలో దర్శించి, ఆయా పాత్రలను మానవాతీతులనుగా కాక సమకాలీన సామాజికులనుగా ప్రదర్శించినాడు.


450

వావిలాల సోమయాజులు సాహిత్యం-4