Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్దశి బుధవారము నాడు (31-8-1864) అవతరించిరి. కారణజన్ములైన వీరు బాల్యమాదిగ శక్రధనువువలె శబలిత కాంతులతో శోభిల్లిన సహస్రమాస జీవితమును గడిపి, సర్వప్రయోజనములను సాధించి 2-1-1945లో నిర్యాణమొందిరి. పూర్ణపురుషాయుష జీవులైన ఈ మహనీయుల తొలి ముప్పది సంవత్సరముల జీవిత చరిత్ర (1864–1897) 'నా యెఱుక' అను స్వీయచరిత్రకు కథావస్తువు.

1903లో శ్రీ వీరేశలింగం పంతులు స్వీయచరిత్ర ప్రకటితమగుటకును, శ్రీ దాసుగారు తమ స్వీయచరిత్రను ఆపివేయుటకును గల సంబంధము అతర్కితోపనతము; కేవలము కాకతాళీయము. తెనుగున స్వీయచరిత్రలు లేని లోపమును తీర్చుటకై 'నా యెఱుక' ను రచింపనుద్యమించిన శ్రీ దాసుగారు, శ్రీ వీరేశలింగం పంతులుగారి ఆత్మకథాప్రకటనతో ఆ లోపము తీరినది గదాయని భావించి, తమ స్వీయచరిత్రను ఆపివేసిరనుట అంగీకరింపదగినది కాదు. శ్రీ కందుకూరివారి స్వీయచరిత్ర రచనారామణీయకమున గాని, సత్యార్థ ప్రకటనా వైశిష్ట్యమున గాని తమరచన కంటే మిన్నగ సాగినదనుటచే వెఱచి ఆపివేసి రనుట అపచారము.

శ్రీ దాసుగారు మొదటినుండియు 'నా యెఱుక' లో తమ ముప్పది సంవత్సరముల జీవితమునే నిక్షేపించ నుద్దేశించినారు. తొలుత ప్రకటితమైన శ్రీ కందుకూరి వారి స్వీయచరిత్ర శ్రీ దాసుగారిని పునరాలోచనకు పురికొల్పి, తమ మొదటి ఉద్దేశమును దృఢతర మొనర్చుటకు తోడ్పడియుండును. "ముప్పదియేండ్ల జీవితకథతోనే తమ స్వీయచరిత్ర నేల ఆపివేసి?” రని ప్రశ్నించినపుడు, శ్రీ నారాయణదాసుగారు ఇట్లు చమత్కారముగ సమాధాన మిచ్చిరట!

“ఎవ్వని చరిత్రమైనను ముప్పదియేండ్ల వఱకే లోకమెఱుగవలయును. ఆ పైని అనవసరము. ముప్పది యేండ్ల వరకే సుగుణముండును. ఆ పైన పేరాసయు, అసంతుష్టియు పెచ్చు రేగిపోవును. దైవత్వము నశించును. దేవతల నందుకే త్రిదశు లన్నారు. ముప్పదియేండ్లు దాటిన మీదట నందరు రాక్షసులే!"

ఇందు శ్రీ దాసుగారు వెల్లడించిన అభిప్రాయములలోని సత్యాసత్యము లెట్లున్నను, స్వీయచరిత్రకు వారు మొదటినుండియు ఉద్దేశించిన వస్తువు తమ ముప్పదియేండ్లు జీవితకథ మాత్రమే అని ప్రస్ఫుటమగు చున్నది. 'ముప్పదియేండ్లు దాటిన మీదట అందఱు రాక్షసులే' అన్న శ్రీ దాసుగారి భావము ప్రముఖాంగ్ల సాహితీవేత్తలలో నొకడును, విశిష్టభావుకుడు, చమత్కారచతురుడైన జార్జి బెర్నార్డు


సాహిత్య విమర్శ

447