Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా ఎఱుక

పీఠిక

1

“నా యెఱుక” సర్వతోముఖ ప్రతిభా విజ్ఞాన ప్రపూర్ణులు, సంగీత సాహిత్య రత్నాకరులు, “హరికథాకర్త్మ కాలక్షేప పితామహ” బిరుదాంకితులు, ప్రసాదిత హరిదాసజన జీవనులు, ప్రముఖాంధ్ర మహాపురుషులు, కారణజన్ములు, చిరస్మరణీయులు అయిన శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి స్వీయచరిత్ర.

ఆధునికాంధ్రసాహిత్య యుగకర్తలుగా పేరెన్నికగన్న శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు, సి.వై. చింతామణి ప్రభృతులైన మిత్రప్రముఖుల ప్రోత్సాహముతో ఆత్మకథారచనమునకు పూనుకొంటిననియు, 'తెలుగు భాషలో స్వీయచరిత్ర రచనకిది ప్రథమ ప్రయత్న' మనియు తమ గ్రంథావతారికలో చెప్పియున్నారు. దీనినిబట్టి స్వీయచరిత్ర రచనాభగీరథులు కందుకూరి వారనిపించును.

“తెలుగులో స్వీయచరిత్రలు లేవనియు, అట్టివానిని తాము వ్రాయవలయుననియు దాసుగారికి తోచెను. అంతట తన చరిత్రము ముప్పది యేండ్లవరకు దాసుగారు వ్రాసిరి. ఇంతలో వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్ర ప్రథమభాగము బయల్వెడలెను. దాసుగారు తాము వ్రాయుచుండిన స్వీయచరిత్రము నాపివేసిరి" - అని శ్రీ నారాయణదాసు జీవితచరిత్రకారులు (పే. 237) తెలిపినారు. శ్రీ వీరేశలింగంగారి స్వీయచరిత్ర ప్రథమభాగము 1903లో చింతామణీ ముద్రణా లయమున ముద్రణనొంది ప్రకటితమైనది. దీనినిబట్టి ప్రకటన దృష్ట్యా శ్రీ కందుకూరి వారి స్వీయచరిత్రకు ప్రాథమ్యమున్నను, రచనదృష్ట్యా శ్రీ ఆదిభట్లవారి “ఆత్మపరిచయమే" (నా యెఱుక' తెలుగున పుట్టిన తొలి స్వీయచరిత్ర అనవలసియున్నది. ఆదిభట్లవారే ఆత్మకథాభగీరథులు వారి 'నా యెఱుక'యే ప్రథమాంధ్ర స్వీయచరిత్ర రచన.

శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు పార్వతీపురమున కెనిమిది మైళ్ళ దూరముననున్న సువర్ణముఖీ నదీతీరమందలిఅజ్జాడ గ్రామములో రక్తాక్షి శ్రావణ శుద్ధ


446

వావిలాల సోమయాజులు సాహిత్యం-4