పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


విపులముగాను, మరికొంత ప్రౌఢముగాను, మిగులు సలక్షణముగాను చూపట్టుచున్నది. ఇందు ప్రయోగసిద్ధములు గాక వ్యవహారైక శరణ్యములగు పెక్కు శబ్దములు కన్పించుచున్నవి. కస్తూరి రంగ కవితా 'నుమామహేశ్వర కరుణాకటాక్షలబ్ధ సాహితీవిభవుడ' నని చెప్పుకొని యున్నాడు. ఇతడు వెంకట కృష్ణార్యుని పుత్రుడు శ్రీ వత్సగోత్రుడు ఆర్వేల కమ్మనియోగి.

అమరసింహుడు (క్రీ.శ. 1788-98)

ఇతని కాలమున మాతృభూతుడను తెలుగు కవి పారిజాతాపహరణమను నాటకమును రచించెను. ఇతడు శాండిల్య గోత్రజుడు. ఈ నాటకమున కవి తన్ను గూర్చి 'మాతృభూత స్వామి మహిత కటాక్ష చాతుర్య పరిలబ్ధ సరస సాహిత్య, సంగీత మధుర వాగ్ఝరి గల్గువాడ, శృంగారరసము తెలిసిన మేలువాడ' నని వ్రాసి కొని యున్నాడు. గద్యయందు 'సుధాసార సంజనిత చతుర్విధ కవితానిర్వాహకుడ' నని చెప్పుకొనినాడు. ఇతడు తన నాటకమును ప్రబంధ ధోరణిని గానయోగ్యముగా నొనర్చెను. మాతృభూతకవి తండ్రి పేరు రంగకవి. ఇతడే గ్రంథములు వ్రాసెనో యెఱుక పడకున్నది. ఇతడు కస్తూరి రంగకవి మాత్రము కాడు. వారి గోత్రమును, వీరి గోత్రమును భేదించినవి.

శరభోజీ (క్రీ.శ. 1798-1832)

ఇతని కాలమున కవుల పోషణ మెట్లుండెనో తెలియరాదు. కాని తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయమును చక్కబరచి తాళపత్ర గ్రంథములకు ననేక ప్రతుల వ్రాయించి భద్రపరపించెను. ఇతడు తాళపత్ర గ్రంథములను తిరుగ వ్రాయించి భద్రపరపించుటకు గాను వరాహప్పయ్య దీక్షితులను ఫౌజుదారును నియమించెను18. ఇతడు వేగినాటి బ్రాహ్మణుడు. అందువలననే శరభోజీ పేరుననే తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయము పేర్కొనబడుచున్నది.

శివాజీ (క్రీ.శ. 1833-35)

ఈ రాజన్యుడు తెలుగున 'అన్న పూర్ణాపరిణయ' మను నాటకమును రచించెను. దానిని 'సకల విద్యాప్రవీణులైన సభ్యులు గల నాటకశాలలందు నటియింప జేయదలపెట్టితి’నని గ్రంథావతారికలో జెప్పుకొని యున్నాడు. ఇందు తంజా పురమునందలి కొంకణేశ్వర అన్నపూర్ణల వివాహోదంతము సొగసుగా వర్ణింపబడినది. ఇతని యాస్థానకవి వెంకట కృష్ణయ్య. ఇతడు శివపారిజాతమను నాటకము నొకదానిని ____________________________________________________________________________________________________

442

వావిలాల సోమయాజులు సాహిత్యం-4