పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రచించినట్లుగా వాడబడుచున్న తిరుప్పా వనుపాటకు తెలుగు సేత. ఇందు పదిపాటలు మాత్రము యున్నవి. కాని యరవమునందు (?) ఇరువదిపాటలు కన్పించుచున్నవి. ప్రతాపసింహుని కోరికపై నెల్లూరి శివరామకవి కామకళానిధియను రతిశాస్త్రమును రచించి మహారాజున కంకితమిచ్చెను.

కామకళకే ప్రాధాన్యమిచ్చిన యీ రాజన్యుని పరిపాలనమున కవులనేకులు రాజాదరణ లేకపోయినను గ్రంథములు రచించిరి. అట్టివారిలో పేర్కొనదగినవాడు రాఘవాచార్యులు. ఇతడు ముద్దుపళని గురువు. ఇతడు నలచరిత్ర, విష్ణుభక్త చరిత్ర అను రెండు ద్విపద గ్రంథములు రచించెను. ఇతడు వైష్ణవుడు. పండిత వంశజుడు. తండ్రితాతలు పండితులై సంగీతాది కళలయందనవద్యులై మెలగిరని చెప్పుకొనెను. ఇతని ఇంటిపేరు చక్రపురివారు. రాఘవాచార్యులు తన తాత 'చక్రపురి విహారుం' డని చెప్పియున్నాడు. ఈ చక్ర పురము ప్రస్తుతము చక్రపల్లియని పిలువబడుచున్నది. తంజావూరు జిల్లా పాపనాశనము తాలూకానందున్నది. ఈ గ్రామము నందు చక్రపల్లి వారనేకులున్నారు. వీరి కులగురువులుగా ప్రస్తుతమును కందాళవారే యున్నారు. ఇచ్చటి చక్రపురివారు రాఘవాచార్య దేశికకవి తమవంశము వాడనియు, తమ వంశము పండిత వంశమనియు సగర్వముగా చెప్పుకొనుచున్నారు. వావిళ్ల వారచ్చు వేయించిన రాఘవాచార్యుని 'నలచరిత్ర' మను గ్రంథమునకు కడప వాస్తవ్యులగు బ్రహ్మశ్రీ జనమంచి శేషాద్రిశర్మగా రుపోద్ఘాతమును రచించిరి. అందు బ్రహ్మశ్రీ శర్మగారు 'ఇతడు దత్తమండలమున ప్రచారమునందున్న మాటలను వాడుట వలనను, ఇతని ఇంటిపేరు గలవారును, ఇతని గురువంశజులును బెక్కు రుండుట చేతను నీ మహాకవి దత్తమండలవాసి యని యే బుధుండైనను దప్పక యొప్పుకొను' నని వ్రాసి యున్నారు. కాని ఇతని వంశజులు 'చక్రపురము' నందున్నారని రాఘవాచార్యులు పేర్కొనుట వలనను, ఇతని వంశజులు దత్త మండలమునకన్న తంజావూరు జిల్లా పాపనాశనము తాలూకాయందు హెచ్చుగ కన్పించుటవలనను, అదియునుగాక రాఘవాచార్యులు 'మా యూరివాడు', 'మా వంశములోని వా' డని సగర్వముగా చక్రపల్లిలోని చక్రపురివారు పేర్కొనుటవలనను' నే నీతని నివాస స్థానము తంజాపుర మండలముగాని, దత్త మండలము కాజాలదని తలచుచున్నాను. బ్రహ్మశ్రీ శర్మగారు చూపిన యాధారములలో చక్రపురి గురువులను గూర్చి ముచ్చటింప దగియున్నది. కాని కవి గురువంశమును బట్టి కవి దేశమును నిర్ణయింప జాలము. అదియును గాక కందాళ వారు రామేశ్వరము మొదలుకొని గోదావరి వరకు గల దేశములో ననేక వైష్ణవ కుటుంబములకు గురువులుగా కన్పించు చున్నారు. తాళ్ళపాక

438

వావిలాల సోమయాజులు సాహిత్యం-4