పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మలంకరించిన వారిలో సుందరి, కమల యను కవయిత్రులు ముఖ్యులు 10. వీరు సంస్కృతమున మంచి ప్రవేశమును సంపాదించి సంస్కృత వాఙ్మయము నందలి విద్ధసాలభంజిక యనునాటకమునకు వ్యాఖ్యానము రచించిరి.

తుళజ మహారాజు తెలుగున 'శివకామసుందరీ పరిణయ' మను నాటకమును రచించి ప్రదర్శింపించెను. ఈ నాటకము ఈ మహారాజు పాండితిని, గానకళాభిజ్ఞ తను వెల్లడి చేయుచున్నది.

ఏకోజీ (క్రీ.శ. 1735-1741)

ఇతడు తెలుగున రామాయణము సుందరకాండమును ద్విపదగా రచియించెను. విఘ్నేశ్వర కల్యాణమును గూడ నాటకముగా రచియించెను. ఏకోజీ ఈ గ్రంథమును రాజ్యమునకు వచ్చినవెనుక రచియించెనో, లేక తండ్రి జీవిత కాలముననే రచియించెనో నిర్ణయింపవలసియున్నది. అనేక పాపపరిహారార్థముగా సుందరకాండ పారాయణమొనర్చు నాచారముగా నున్నది. సంస్కృత సుందర కాండమును పారాయణ మొనర్పలేనివారలకు ఈ మహారాజు గానయోగ్యమగు నీ ద్విపద సుందరకాండమును రచియించి యండునని తలపవచ్చును. ఇతని జీవితకాలమున తల్లి రాజ్యమొనర్చు చున్నటుల తెలియుటచే, నీతడు రాజకుమారుడుగా నున్నట్లెంచవలయును.

శాహ మహారాజు (క్రీ.శ. 1741-49)

ఏకోజీ తరువాత నీతని కుమారుడగు శాహ మహారాజు క్రీ.శ. 1741 నుండి 1749 వరకు రాజ్యపాలన మొనర్చినవెనుక, అతని పదభ్రష్టుని గావించి యాతని సవతి తమ్ముడగు ప్రతాపసింహుడు రాజ్యమునకు వచ్చెను. ఈ శాహమహారాజు కాలమునగల వాఙ్మయ వికాసమును దెలిసికొనుటకేమియూ నాధారములు లేవు.

ప్రతాప సింహుడు (క్రీ.శ. 1749-64)

ఈ రాజన్యుడు విషయలోలుడై రాజ కార్యములందు మనస్సు పెట్టలేదు. కాని కవులను, ముఖ్యముగా కామకళ నెఱింగినవారలను పోషించినట్లు కన్పించును. ఇతని విషయలంపటతను సహింపజాలని 'వాంఛేశ్వరు' డను సంస్కృతకవి యన్యాపదేశముగ ‘మహిష శతకము' ను రచించి ఈ రాజన్యుని బుద్ధి మార్చుటకు బ్రయత్నించెను. వాంఛేశ్వరుడు రాజుగారి గృహామాత్యుడు, విద్వత్కవి. తెలుగున రాధికాసాంత్వనము లేక ఇళాపరిణయమును రచించిన ముద్దుపళని ప్రతాపసింహుని యుంపుడుకత్తెయే.

____________________________________________________________________________________________________

436

వావిలాల సోమయాజులు సాహిత్యం-4