పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శాహమహారాజు రచియించిన నాటకములలో ఖిలమైపోయినవి పోగా తంజావూరు నాఙ్మయసర్వస్వ మనిపించుకొనిన సరస్వతీ మహల్ గ్రంథాలయమున వ్రాతప్రతులుగా మిగిలియున్న వానిలో రతీకల్యాణ నాటకము, రుక్మిణీ సత్యభామా సంవాదము, వల్లీకల్యాణము (కుమారస్వామి వల్లీదేవుల వివాహము), విఘ్నేశ్వర కల్యాణము, శంకరపల్లకి సేవాప్రబంధము, సతీదానసూరము, సతీపతి దాన విలాసము, సీతాకల్యాణము, రామపట్టాభిషేకము, జలక్రీడలు, కంసవధ, సరస్వతీ విలాసము, శచీపురందరము, శాంతాకల్యాణము, విష్ణుపల్లకి సేవాప్రబంధము లను నాటకములు కొన్ని. పై నాటకము లన్నిటిలో సరస్వతీ కల్యాణకర్తృత్వమును గూర్చి కొంచెముగా జెప్పవలసి యున్నది. గ్రంథమున శేషాచలపతి రచించె ననియు, గ్రంథాంతమున శాహమహారాజు రచియించె ననియు చెప్పబడి యున్నది. సరస్వతీ మహల్ గ్రంథాలయము కేటలాగు సంపాదకులు గ్రంథ మంతయు శేషాచలపతి వ్రాసినదేగాని కారణాంతరమువలన మహారాజు హెచ్చు భాగమును వ్రాయుట వలననో యేమో శాహ మహారాజు పేరనే చెల్లుబడియగుచున్నదని చెప్పబూనిరి. కాని యంతకన్న శేషాచలపతి గ్రంథమును కొంతవరకు రచియించి స్వర్లోకమున కేగిన వెనుక, కొరవడిన యధికభాగమును శాహ మహారాజు పూరించుటచే నా గ్రంథము అతని పేరుననే చెల్లుబడియగుచున్నదనుట సమంజసముగా దోచుచున్నది.

శాహమహారాజు తెనుగున రచించిన గ్రంథము లన్నియు నాటకములే. కొన్నిటికి నాటకములనియు, కొన్నిటికి ప్రబంధములనియు పేరుపెట్టి రెండవ రకము వానియందు సంస్కృత పదజాలము, సంగీత శాస్త్ర పాండితీ ప్రకర్ష చూపించెను. 'ప్రబంధం కల్పనా కథా' యను సూక్తి నాధారముగా గొని వర్ణనలు కల్పించి, ప్రఖ్యాత ఇతివృత్తములనే నాటకములుగా నొనర్చి నాటికి ప్రబంధత్వ మారోపించి, నాటకములయెడ పండితులకు గల గౌరవమును పెంపొందించెను. ప్రబంధములకు మిగిలిన రెండవ తరగతి 'నాటకము'లు పామర జనవేద్యములు. సంస్కృత వాఙ్మయమునందు వలెనే తెలుగు వాఙ్మయము నందును శాహమహారాజును నాయకుని జేసి రచించిన గ్రంథము లనేకములు గలవు. ఇట్టి గ్రంథములన్నియు నాతని పరిపాలనకాలముననే రచింపబడిన వనుట యుక్తము. అట్టివానిలో శాహజీ సాహిత్యము, శాహజీయము, శాహజీ దండకములు ముఖ్యములు. శాహమహారాజు నాస్థానము నలంకరించిన తెలుగు కవులలో ప్రథమమున పేర్కొన దగినవాడు గిరిరాజకవి. ఇతడు అనిర్వచ్యమగు నోంకారమును

432

వావిలాల సోమయాజులు సాహిత్యం-4