పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తంజావూరు మహారాష్ట్ర నాయకులు:

ఆంధ్రవాఙ్మయము

విజయనగర సామ్రాజ్యాస్తమయమునకు వెనుక రెండు శతాబ్దుల కాలమాంధ్రవాఙ్మయపోషకులుగా నుండిన దక్షిణదేశ నాయకరాజులు స్వతంత్రించిరి. వీరు మొదట విజయనగర సమ్రాట్టులచే బ్రతినిధులుగా సంపబడిన తెలుగు నాయకులు. వీరి పాలనకాలములో తమిళ దేశమునకు దెలుగు తెగ లనేకములు వలస పోయినటుల స్థానిక చరిత్రలవలన దెలియుచున్నది. ఈ తెలుగు నాయకులు ఆంధ్రవాఙ్మయ పక్షపాతులై వెలలేని సాయమొనర్చిరి. తిరుచునాపల్లి, పుదుక్కోటల రాజులగు తొండమాన్ వంశజులు తమిళులైనను తెలుగు కవితాకుమారికి వశులై, సారస్వతాంబుధి నోలలాడిరి. ఈ కాలమున తంజావూరు, మధుర, తిరుచునాపల్లి, పుదుక్కోట లాంధ్ర వాఙ్మయమునకు విద్యాస్థానములై విలసిల్లినవని చెప్పవలయును. విజయనగర రాజులతో బ్రబంధయుగ మంతరించినది. ఈ యుగమున నాటకములు, వచన కావ్యములు విరివిగా అభివృద్ధిలోనికి వచ్చినవి. కావున నీ యుగమును 'నాటక వచన కావ్యయుగ’మనిగాని, దక్షిణ దేశమున నీ కాలమునం దాంధ్రవాఙ్మయ మభివృద్ధి బొందుటవలన 'దక్షిణ దేశ ఆంధ్ర వాఙ్మయ' (1600-1800) మని గాని పిలవవచ్చును. ఇది ప్రబంధ అధునాతన యుగములకు సంధియుగము.

పైన పేర్కొనబడిన విద్యాస్థానములలో తంజావూరును క్రీ.శ. 1535 - 1675 వరకు నాంధ్ర నాయకులు పరిపాలించిరి. వీరి తరువాత తంజావూరునందు క్రీ.శ. 1800 వరకును మహారాష్ట్రులు తమ పరిపాలనమును నెలకొల్పి, యాంధ్రభాషను బోషించి మహాయశస్సును గడించిరి. అన్యదేశీయులైనను వీరు శిల్పమునకు నా దేశమున పారంపర్యముగా వచ్చు నాంధ్ర సారస్వతమునకు జేయూత నిచ్చిరి. దక్షిణ హిందూ దేశమున వీరి పరిపాలనకాలమున గట్టబడిన దేవాలయములు, ప్రాచీన హైందవ చిత్రకళానైపుణ్యమును, శిల్ప నైపుణ్యమును జాటుచున్నది. వీరాంధ్ర వాఙ్మయమును బోషించుటలో నాంధ్ర నాయకుల యడుగుజాడలనుబట్టి నడచిరి. ఆంధ్ర సారస్వతమును బోషించిన యన్య దేశీయులలో నగ్రస్థానము వీరికే జెందవలసి యున్నది. పాఠకుల సౌకర్యార్థమై నీ రాజన్యుల వంశవృక్షము పొందు పరుపబడుచున్నది. ____________________________________________________________________________________________________

సాహిత్య విమర్శ

427