పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సీ. [1]“దక్షిణాశావధూతనయుఁ డై వనలక్ష్మి
           పెంపునఁ బొదరిండ్ల బెరిగి పెరిగి,
     తేఁటిజోటుల జోలపాటలఁ బాటిల్లి
           తీఁగయుయ్యాలలఁ దూఁగి తూఁగి
     కమలాకరంబులఁ గమ్మ పూఁదేనెల
           నానుచుఁ జల్ల పోరాడి యాడి
     కమలధూళీపాళికాకేళికలఁ బొల్చి
           మందమందవిహార మొంది యొంది

తే. యాగమస్థితి యెఱిఁగి బాల్యంబుతఱిని
    మల్లుల బెనంగి పాంథుల మర్మ మెఱిఁగి
    సాముఁ జేయుచు మాధవస్వామి యాజ్ఞ
    కంతుజోడై మెలంగు లేగాడ్పుకుఱ్ఱ.”

ఇందువలన మలయానిలుఁ డుదాత్తమైన జన్మకలవాఁడగుటయే కాక యుత్తమసంస్కారముల నొందిన యుదాత్త చరిత్రుఁడని యభివ్యక్తమగుచున్నది.

[2]గండాభోగప్రతిఫలితతాటంకయుగళముచేఁ జతుశ్చక్రమై యొప్పు సౌందర్య లహరీముఖరథమును బూన్చికొని యర్కేందుచక్రమగు నతనిరథమెక్కి ప్రమథపతి వచ్చిన నెవఁ డళుకు బెళుకు లేక ప్రతిఘటించుచున్నాఁడో యట్టి మన్మథుఁడు తన కాప్తమిత్రుఁ డను గర్వము గంధవహునికి లేకపోలేదు.

ఒకనాఁడు మలయానిలుఁడు 'మహిళామండలమంజుల భ్రమరకామర్దుండును, శ్యామాముహుర్ముహురున్మీలితపత్త్ర భేదనిపుణుండును, పద్మినీకంకణ గ్రహణాపాదియు నై సగంధ విటపప్రాప్తితో విజృంభించియుండ' నతని మన భట్టుమూర్తి దర్శించినాఁడు, మఱియొక ప్రబంధకవి విచ్చలవిడిగా నతఁడు విఱ్ఱవీగి సంచరించుచు 'మల్లికాసు మగళన్మకరందహేరాళ ధారాజలంబులఁ దడిసి తడిసి, సరసిజకైరవ సంతానసంక్రాంత వీచికావళుల మీఁద విడిసి విడిసి, ప్రత్యగ్రప్రసవ సంపూరిత చూతమంజరులపై సుడిసి, సుడిసి, తతవియోగశ్రాంత తరుణీ జనస్వాంత జనిత భేదములలో జడిసి జడిసి, బహుళకోరక కుసుమసంభరిత మంజుపట విహరణ ముదిత బంభర వితాన మధుర తరగీతికాసంస్తూయమానుఁ డగుచు' విశ్వవిఖ్యాతి గడించుకొను

మనోహరదృశ్యములఁ గన్నులారఁగని ముదితాంతఃకరణుఁ డైనాఁడు.
  1. దక్షిణాశావధూ - ప్రాచీన కవిప్రోక్తము
  2. గండాభోగ ప్రతిఫలిత - ఆచార్య శంకరుని సౌందర్య లహరిలోని యీ శ్లోకము మూలము:

    “స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం
    చతుశ్చక్రం మన్యే తవముఖ మిదం మన్మథరథమ్ |
    యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
    మహావీరోమారః ప్రమథపతయే సజ్జితవతే ॥”

____________________________________________________________________________________________________

42

వావిలాల సోమయాజులు సాహిత్యం-4