Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచీన తక్షశిలలో ఒక మాజియన్ దేవాలయం ఉన్నట్లూ క్రీ.శ. 50 ప్రాంతంలో టైనా రాజు అప్పయినియసు దానిని దర్శించి కానుక లర్పించినట్లూ పరిశోధనల వల్ల వెల్లడైంది. కనిష్కుని నాణెముల మీద కనిపించే ప్రతిమను కొందరు 'మాజియను రాజు' అని నిరూపించారు. కానీ అది ఎనైటిస్, ఆత్రో, మిత్రో మొదలైన నామాలను బట్టి చూస్తే సూర్యదేవుని ప్రతిమలనే అభిప్రాయం కలుగుతున్నది. అటు తరువాతి కాలంలో సూర్య ప్రతిమలు ప్రాంతీయాలైన ఆహార్యాలతో రూపొందినవి. రాజ తరంగిణి కర్త కల్హణుడు కాశ్మీర మిహిరేశ్వరాలయాన్ని కుషాను రాజు మిహిరకులుడు కట్టించినట్లు వ్రాసినాడు. అక్కడ అతను సోదరీమణులతోనూ, కోడండ్రతోనూ సంభోగాన్ని నెరపే బ్రాహ్మణులను అర్చకులుగా నిల్పినట్లు పై గ్రంథం పలుకుతున్నది. బహుశః వీరు మాంత్రికులు కావచ్చును.

సుప్రసిద్ధ భారతీయ జ్యోతిషశాస్త్రవేత్త వరాహమిహిరుడు. (క్రీ.శ. 587 ప్రాంతము) అతని తండ్రి ఆదిత్యదాసుడు. వీరి నామావళిలో సూర్యునికి ఉన్న సంబంధం గమనింపతగ్గది. వరాహమిహిరుడు అతని బృహజ్జాతకాన్ని సూర్యస్తుతితో ప్రారంభించినాడు. అతడు వర్ణించిన సూర్యరూపము కనిష్కుని నాణెముల మీద కనుపించే హీలియొనన్ను జ్ఞప్తికి చేస్తున్నదని ప్రతిమాశాస్త్రాభిజ్ఞుల (Iconographists) అభిప్రాయము. అతని కిరీటము, కీర్తిముఖము, వివర్తోత్తరీయము మొదలైన లక్షణాలు తరువాతి కాలంలో పుట్టిన సూర్యప్రతిమల్లో కనిపించవు.

సూర్యదేవుని అనాది ప్రతిమారూపాలలో ఒకటి బుద్ధగయలోని ఒకానొక ఫలక శిల్పం మీద కనిపిస్తున్నది. అందులో సూర్యుడు ఉషస్సు, ప్రత్యుషస్సులతో రథం మీద పయనమౌతున్నట్లు చిత్రితుడైనాడు. కలకత్తా వస్తుప్రదర్శనాలయంలో ఒక ఉషోదేవతతో మాత్రమే రథము మీద కూర్చొన్న సూర్య శిల్పము ఒకటి ఉన్నది.

భవిష్యపురాణంలో కృష్ణుని కుమారుడు సాంబుడు చీనాబ్ నది ఒడ్డున ఉన్న మిత్రవనంలోని సూర్యుని దేవాలయం దగ్గిరకు యాత్రకు వెళ్ళి, అతని కుష్టు రోగాన్ని పోగొట్టుకున్నట్లు ఒక కథనం కనిపిస్తున్నది. అతడు ఆ ప్రాంతంలో మరొక సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు దానికి అర్చకులు దొరకకపోతే, శిథియనుల దేశమైన శకద్వీపంనుంచి కొందరు మఘవంశాలవారిని పిలిపించినట్లు ఆ గ్రంథం చెపుతున్నది. ఈ మఘలు బ్రాహ్మణులకు సూర్యునికీ, నిక్షుభకూ కుమారుడైన జరాశబ్ధునికీ, మిహిర గోత్రుడైన ఒక బ్రాహ్మణుని కుమార్తె శైవహకూ జన్మించిన వంశంలో వారట! ఈ మఘ బ్రాహ్మణులకు చతుర్వేదాలున్నవి. అవి ఋగ్వేదాదులు కావు. అవి వాదము,


418

వావిలాల సోమయాజులు సాహిత్యం-4