Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋగ్వేదంలో కనిపిస్తున్నది (VIII -60). సావిత్రికి రెండు గుర్రాల రథ మున్నదట. (1-32) సూర్య సావిత్రులిద్దరూ దుఃస్వప్న దోషాలను పోగొట్టుతారని కొన్ని మంత్రాలు కనిపిస్తున్నవి. (5-32, I-35)

ఆదిత్య వర్గములో ఒకడు. తరువాతి కాలంలో పూష శబ్దం సూర్యునికి ఒక నామమైంది. ఈశావాస్యోపనిషత్తులోని 'హిరణ్మయేన, పాత్రేణ సత్యస్యాపి హితమ్ ముఖమ్...' ఇత్యాది వాక్యాలు ఇందుకు ప్రమాణము.

వేదకాలానంతరము విష్ణువు ఆదిత్యుల్లో ప్రథముడైనాడు. సూర్యుని త్రిమూర్త్యాత్మకత్వము ఆ నాడు విష్ణువుది. ఋగ్వేదంతో సంబంధం ఉన్న ఐతరేయ బ్రాహ్మణము ప్రారంభంలోనే అగ్నిర్వై దేవానా మనమో విష్ణుః పరమస్తదంతరేణ సర్వా - అన్యదేవతల వల్ల విష్ణుసూక్తాలకు తాత్పర్యం ఏమంటే (అతడు భువనరక్షకుడు) 'ఇనో విశ్వస్య భువనస్యగోపా' అన్న వాక్యం ఇందుకు ప్రమాణము. 'అఖిలామ్నా యైక వేద్యో హరిః' అన్న మధ్వాచార్యులవారి వాక్యానికి అనుగుణమైన విష్ణుప్రశంస అక్కడనే కనిపిస్తుంది. విష్ణువుకు సంవత్సరంలో నాల్గవ భాగంతో మాత్రమే సంబంధమున్నట్లు ఋగ్వేదంలో ఒక సూక్తం కనిపిస్తున్నది. విష్ణువును గురించి ఋగ్వేదంలో కనిపించే సూక్తాలను (1:22; 1-17) పరిశీలిస్తే అతడు దేవదేవుడని వ్యక్తమౌతుంది. అందువల్లనే ఆయన ఆదిత్యవర్గంలో తరువాతి కాలాన ప్రథమగణ్యుడై ఉంటాడు. విష్ణువులో ఆదిత్యాంశమేమీ లేదని ఓల్డెను బర్గు పండితుడు వ్రాసిన వ్రాతను (Vedic Mythology. P. 35) ప్రాచ్య పండితులు అంగీకరింపక 'వైష్ణవోం శబర స్సూర్యః అంతర్జ్యోతి రనంప్లవం, అభిమాయత మోంకారం తస్య తత్ప్రేరమ్ పరమ్' అన్న విష్ణుపురాణవాక్యాన్ని (11.8.35) ప్రమాణంగా చూపించినారు.


సూర్యుణ్ణి గురించి 'క్షత్రియ కాశ్యపం రక్తం కాళింగం ద్వాదశాంగుళం, పద్మహస్తం పూర్వాననం, సప్తాశ్వ వాహనం, శివా౽ధి దైవతం, ధ్యాయే ద్వహ్ని ప్రత్యధి దైవతమ్' అన్న వాక్యాన్ని అనుసరించి చూస్తే, సూర్యుడు క్షత్రియుడని తెలుస్తున్నది. కొన్ని చోట్ల 'అతడు బ్రాహ్మణు' డని ఉన్నది. అదితి - కశ్యప సంతానం కావటం వల్ల కాశ్యపుడైనాడనీ వ్యక్తమతున్నది. పద్మం సూర్యునితో వికసిస్తుంది గనుక అతను పద్మాననుడైనాడనీ, పూర్వ దిశన ఉదయించటం వల్ల పూర్వాననుడైనాడనీ కొందరు నిశ్చయించినారు. సప్తసంఖ్యకూ, సూర్యుడికీ విశేషమైన సంబంధం ఉన్నది. మాకరీ, సప్తమి సూర్యోపాసనకు ప్రత్యేకమైన దినంగా ఏర్పడ్డది. ఆ నాడు సూర్యుణ్ణి క్రింది మంత్రంతో అర్చించమని ఆదేశం.


సంస్కృతి

415