Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేఘాల నన్నిటినీ తిని భూమిని ఎండించి పంట పండించేటందుకు సూర్యుణ్ణి వెలిగిస్తున్నామని సంతోషిస్తారట! సూర్యుడి చేత ఎండ కాయించటమనే చిత్రమైన ఒక ప్రక్రియను 'వాట్లోవా' అనే పేరుతో బాంకు ద్వీపవాసులు జరిపిస్తారు. 'వాట్లోవా' ఒక రాతి ముక్క దానిచుట్టూ ఎర్రని గుడ్డ కడతారు. ఇది సూర్యునికి ప్రతీక. కిరణాలను చాపటానికి దీని చుట్టూ గుడ్లగూబ ఈకలు నల్లగుడ్డతో కడతారు. పాటలు పాడి నృత్యం చేసి దీనిని చుట్టూ త్రిప్పుతారు.

సప్తసప్తి

హిందూ సంప్రదాయాన్ని అనుసరించీ, ప్రపంచంలోని అనేక ఇతరజాతులను అనుసరించీ, సూర్యుడు తూర్పుదిక్కుకు అధిపతి. అమరసింహుడు అతనికి 32 నామాలు చెప్పినాడు. నామ లింగానుశాసనకర్త వాటికి వ్యుత్పత్త్యర్థాలను నిరూపించినాడు. అమరంలో కనుపించే నామాలు కాక మరికొందరు సూర్యుణ్ణి భగ, వృద్ధ, హరి, కాశ్యపేయాది శబ్దాలతో కూడా వ్యవహరించారు.

శతపథ బ్రాహ్మణము పన్నెండు మంది సూర్యులను పేర్కొన్నది. 'నానా లింగత్వాత్ ఋతూనాం నానా సూర్యత్వం' అనే ప్రమాణాల్ని అనుసరించి చూస్తే, ఈ ద్వాదశ సంఖ్య ద్వాదశ రూపాలను అనుసరించి పుట్టినట్లు కనిపిస్తుంది. ఋగ్వేదంలో ఒకచోట సూర్యులు ఆరుగురనీ (2-27), ఒకచోట ఏడుగురనీ (Tilak - Architic Home in the Vedas - Dawns) ఉన్నది. తైత్తిరీయ సంహిత సూర్యులు ఎనమండ్రురురని ఒకచోటా, పన్నెండుమంది అని ఒకచోటా వ్రాసింది. ఉపనిషత్తులలోనూ, పురాణాలలోనూ సూర్యులు పన్నెండుగురు.

వేదకాలంలో హిందువులు ఆదిత్యుని మైత్రేయుడు, సావిత్రి, సూర్యుడు మొదలైన నామాలతో వ్యవహరించారు. ఋగ్వేదకాలంలో ఆదిత్యుని ఇతర మూర్తులకంటే సూర్యుని గురించి విశేషప్రస్తావన కనిపిస్తుంది. అతడు జ్యోతిర్మయుడు. సావిత్రికి కొంత క్లిష్టత కనిపిస్తున్నది. మైత్రేయుడు జ్యోతిర్దేవత. సూర్యునికీ మిగిలిన ఆదిత్య వర్గాలకీ ఉన్న సంబంధం ఎటువంటిదో ఆ వర్ణనలను పరికించి చెప్పటము కష్టము. అనేక సందర్భాలలో ఇతని స్వరూపస్వభావాదులు, ఇతర ఆదిత్యవర్గంలోని వారి స్వరూపస్వభావాదులతో సరిపోతున్నది. (ఋగ్వే. 36,75) సూర్యుడు, సావిత్రి ఇద్దరూ ఉషాధినాథులు. సూర్యుడు అదితి పుత్రుడు (1.191) సావిత్రి మైత్రేయులు ఆదిత్యులు (VII, 18; 11-22) సూర్యుడు సప్తాశ్వరథాన్ని ఎక్కి ఆకాశసంచారం చేస్తాడని వర్ణన


414

వావిలాల సోమయాజులు సాహిత్యం-4