Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యుడు ఆకాశపథాన రథం మీద ప్రయాణం చేస్తాడని పురాతన గ్రీకుల నమ్మకము. అందువల్ల వారూ, రోడీషియనులు సంవత్సరానికి ఒక రథాన్నీ, నాలుగు గుర్రాలను సూర్యోదయసమయాన సముద్రంలో ఒదిలి పెట్టేవారు.

పెరూవియన్ ఆండిస్ అనే లోయలో రెండు శిథిలరాజగృహాలున్నవి. వాటిమధ్య ఇనుపవంకీలకు ఒక వల వేసి ఉంటుంది. ఇది సూర్యుణ్ణి పట్టుకుని వేగం తగ్గించటానికి ఉద్దేశించినట్లు వారి జనశ్రుతి (Tradition). వారి పూర్వుల్లో అనేకులు సూర్యుణ్ణి ఆ విధంగా పట్టి బంధించినవారు ఉన్నారని వారి నమ్మకము. సూర్యుడు ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు పట్టుకొని నిలపటానికని 'వల ఆట', దక్షిణానికి వెళ్ళుతుంటే తిరిగి రావటానికి 'గిన్నె - బంతి' ఆట ఇగ్గులిక్కు అనే జాతివారిలో ఆడటము ఒక ఆచారము. ఆస్ట్రేలియాలోని అనాది జాతులవారు అడవుల్లో, పొలాల్లో పని చేసుకుంటూ సూర్యుణ్ణి త్వరగా అస్తమించకుండా చేయటానికి నల్లగుడ్డ ఒకటి సూర్యుడికి ఎదురుగా ఎత్తయిన చెట్టుమీద కడతారట! త్వరగా వస్తే తొందరగా ఇంటికి వెళ్ళవచ్చుననే సందర్భం కలిగినప్పుడు ఇసుక పైకి చల్లి నోటితో సూర్యుని వైపు ఊదుతారు. (IBID)

పెరూలోని 'ఇంకాలు' తాము సూర్యపుత్రులమని చెప్పుకుంటారు. వారిని ఇతరులు దేవతలుగా భావించి సమస్తవిధాలా గౌరవిస్తారు. ఇంకాలకు జబ్బు చేస్తే ఇతరులు భావించినట్లు భావించరు. అప్పుడు తమ తండ్రి అయిన సూర్యభగవానుడు శ్రమతీర్చు కోవటానికి పంపిన ఒక దూతగా భావిస్తారు. మృత్యువు ఆసన్న మౌతున్నప్పుడు దూరం చేసుకోవాలని ఎటువంటి క్రతువులూ చెయ్యరు, బలులు ఇవ్వరు. 'మా తండ్రి (సూర్యుడు) మమ్మల్ని వచ్చి తనతో కలుసుకోమని కోరుతుంటే అడ్డు పెట్టటమెందుకని అంటారు.

ప్రాచీన కాలంలో పార్థియా రాజులు సూర్యుణ్ణి వారి భ్రాతగా భావించేవారు. ఈజిప్టు రాజులు దివ్యత్వాన్ని సమర్థించి జీవితకాలంలోనే విగ్రహాలు చేయించుకుని పూజాపునస్కారాలు పొందినారు. వారు సూర్యోద్భవులు, సమస్తజగత్తూ సూర్యోద్భవము. వారి బిరుదాలలో సూర్య నామం ఒకటి.

టిమ్రోషీ జాతివారు ఒక నల్లపందిని వర్షం కోసం భూదేవతకూ, ఎర్రని పందిని ఎండ కోసం సూర్యుడికీ బలి ఇస్తారట! (IBID P.18) ఆ సమయంలో ఆయన్ను 'ఓ సూర్యభగవానుడా! నీవు నిరంతరమూ ఎర్రగా మండుతూ ఉండు. ఆకాశంలో దట్టంగా క్రమ్ముకున్న నీలిమేఘాల నన్నిటినీ తినివెయ్యి' అని అడుగుతారట! చాల్డియాలు మూత రాయితో చక్రం చేసి ఒక కొరవిని ఆ రంధ్రాలలో ఉంచి, అనేక పర్యాయాలు త్రిప్పుతూ


సంస్కృతి

413