Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యుడు - సూర్యోపాసన

బాబరు ఆర్చిపెలగోలో సంతానాన్ని అర్థించే స్త్రీ, ఒక పెద్ద సంసారానికి తండ్రిని ఒకణ్ణి ఆహ్వానించి ఒక దినాన 'ఉపువెరో' అనే సూర్యుణ్ణి ప్రార్థించవలసిందని అతణ్ణి కోరుతుందట! (Fraser Sympathetic Magic - P 22) భర్తను యుద్ధభూమికి పంపించి తిరిగివచ్చిన 'కై' జాతిస్త్రీలు 'ఓ సూర్యచంద్రులారా! నూనె రాసిన వస్తువులమీద వాన చినుకులు జారిపోయి నట్లు మా భర్తలమీద శత్రువులు ప్రయోగించే ఆయుధాలు పడకుండా చేయండి' అని కోరుతారట! (IBID - P. 42) గ్రహణసమయంలో సూర్యుడు చల్లారిపోతున్నాడనే ఉద్దేశంతో జింబాబ్వే జాతివారు నిప్పుతో వెలిగించిన బాణాలను ఆకాశంలోకి విసురుతారు. అవి సూర్యుణ్ణి వెలిగిస్తాయని వారి నమ్మకం. పెరూలోని సెన్సిస్సులు గ్రహణ సమయంలో బాణాలను ప్రయోగించి సూర్యునితో పోరాడుతూ ఉన్న భూతాన్ని ఛేదించామని తృప్తి పడతారు. గ్రహణసమయంలో చిల్కోటిన్ ఇండియన్లు పైన పెద్ద బరువు ఉన్నట్లు నటిస్తూ ఒక చక్రాకారంలో నడుస్తారట. సూర్యుని ప్రతినిధులమని భావించుకునే పురాతన ఈజిప్టు దేశపు రాజులు గ్రహణ సమయంలో 'రా' (సూర్యుడు) దేవాలయాల చుట్టూ తిరిగి యథారీతిగా వెలుగును ప్రసాదించ వలసిందని ప్రార్థిస్తారు. వేసంగి కాలం రాగానే లోకయాత్రలో వృద్ధుడు అయిన సూర్యదేవుడికి ఒక ఊతకర్ర కావలెననే ఉద్దేశంతో, పురాతన ఈజిప్టు దేశస్థులు 'ఊతకర్ర పండుగ' (Nativity of the Sun's walking stick) చేసేవారు.

ప్రాచీన కాలపు మెక్సికనులు సమస్తశక్తీ సూర్యోద్భవమని భావించి, ఆయనకు 'ఇపల్ నె మహౌని' అని నామకరణం చేశారు. దానికి 'ఎవరి వల్ల సమస్త ప్రాణులూ బ్రతుకుతున్నవో అతను' అని ఆ భాషలో వ్యుత్పత్త్యర్ధము. సూర్యుడు తన సమస్తశక్తినీ లోకానికి ప్రసాదిస్తున్నాడట. అందువల్ల అతనికి శక్తి కలగటానికి మనం కొన్ని బలులు ఇవ్వవలెననే సిద్ధాంతాలతో, సూర్యుణ్ణి ఉద్దేశించి మెక్సికనులు నరబలులు కూడా ఇచ్చారు. సమస్త ప్రపంచాలలోనూ, నరబలుల విషయంలో ప్రాచీన మెక్సికనులంత ప్రసిద్దులు లేరు.


412

వావిలాల సోమయాజులు సాహిత్యం-4