వజ్రపు కమ్మలూ వచ్చినవి. 'దుద్దు' అంటే 'అకరువు.' బంగారం చైనా రాళ్ళు పొదిగినా దుద్దురూపం ఉన్నంతవరకూ అవి దుద్దులే - ఇలాగా, కవుల గండపెండేరాలకూ, సోమయాజులవారి సింహతలాటాలకూ, నర్తకుల లోలాకులకూ, బిబ్బీల జూకాలకూ, వనితల ఒడ్డాణాలకూ చరిత్ర ఉంది.
ఒక జాతిలోనే ఒక్కొక్క సంఘం ఒకవిధమైన సంకేతాలనూ, ఆకారాలనూ ఏర్పరుచుకుంటుంది. ఛాందసులు నెయ్యి అనటానికి 'తేజోవై' అంటారు. 'వాయవ్యం' అంటే వారి పరిభాషలో 'రూపాయి' 'యువాసు' అంటే బట్ట. బ్రహ్మచారిని 'అమాయంతు' అంటారు. విధవను 'ఇంద్రాణీ' అంటారు. నీటితుప్పర పడుతుంటే 'యా కుందేందు’ అనే సరస్వతీ స్తోత్రం చదువుతారు. తరుణిని 'ఆక్రంద' అనీ, ముసలి మనిషిని 'ఏతావా ఇడా' అనీ వ్యవహరిస్తారు. ఎగతాళికి మనం వాడే 'ఎద్దేవా' వైదిక పరిభాషల్లోనిదే. తిట్లలో ద్రాపె, యం బ్రహ్మ ఇత్యాదులు మనకు వారు ప్రసాదించినవే.
తల్లిదండ్రులకు కొందరు బిడ్డల మీదనే మమకారమున్నట్లు కవులకూ, రచయితలకూ కొన్ని శబ్దాలమీదనే మమకారం విశేషంగా ఉంటుంది. అది సకారణమూ కావచ్చును. అకారణమూ కావచ్చును. వారు వ్యక్తంగానో, అవ్యక్తంగానో, వారి కావ్యాలలోనూ రచనల్లోనూ వాటిని విశేషంగా ప్రయోగిస్తుంటారు. శబ్దాలే చివరకు వారి బిరుదనామాలై జన్మ నామాలు నశించి పోతవి. భవభూతికి భవభూతి శబ్దం మీద విశేష మమకారమట! భారవి, రత్నభేట శబ్దాలవల్లనే వారికి ఆ పేర్లు వచ్చినవి. 'జఘనచపల, వికటనితంబ'లకు ఆ పేర్లు శబ్దంమీద మమకారం వల్ల కలిగినవే కాని, వారి జఘనచాపల్యం వల్లనూ, నితంబవికటత్వం వల్లనూ కలిగినవి కావు.
శబ్ద చరిత్రే మానవజాతి చరిత్ర అని చెప్పవచ్చును. పదజాలానికి చరిత్ర అత్యవసరము. అది వచ్చిన నాడే జాతి చరిత్ర పరిపూర్ణమౌతుంది. ఆ జాతికీ భాషలోని శబ్దజాలాన్ని పరిశోధించుకోవడము అత్యవసరము. పరిశోధన వల్లనే ఆయా కాలాల్లో ఆయా సన్నివేశాలల్లో జాతి అజ్ఞానవిజ్ఞానాలూ, ఆకారప్రకారాలూ, అభ్యుదయా నభ్యుదయాలూ ప్రతిఫలిస్తవి. ఆంధ్రభాషకు ఈ మహాచరిత్ర రచన సంభవించే స్థితి ఏ నాటికో?
- భారతి, జనవరి 1948
సంస్కృతి
411