పుట్టిన 'కొబ్బరినూనె' లేనిదే కోమలాంగులు ఛాందస కుటుంబాలలో కూడా కురులు ముడువరు. బత్తాయిపండును ప్రిస్క్రైబ్ చెయ్యని ఫిజిషయన్ కనుపించడు. సోడాబుడ్డీ లేకపోతే సుష్టయిన భోజనం ఈ దినాలలో శుద్ధశ్రోత్రియుడికి కూడా అరగటం లేదనటంలో అసంబద్ధత అణుమాత్రమూ లేదు. సాలామిస్ట్రీ, సఫేద్మిస్ట్రీ, ముస్తకీ, రూమ్, గావుజ్, బాల్, బాన్లు లేకపోతే మన అంటురోగాలు మొదలారి ఆరోగ్యం చేకూరటం లేదు. తుపాకులు, సనీలు, బజాయీలు, జిల్లీలు, తూటాలు, ఔట్లు లేనిదే తెలుగుదేశంలోకి దీపావళిదేవత తిరిగి తిరిగి రావటం మానేస్తుంది. టెలిగ్రాఫ్, టెలిఫోనులతో పని పడకుండా ఉండటమూ లేదు. 'రేడియో న్యూస్' వింటేగాని నిద్రపట్టటమూ లేదు.
ప్రభుత్వాలతో పాటు దుస్తులూ మారుతూ వచ్చినవి. చనుకట్టు పోయి కంచెల వచ్చింది. అది కొంతకాలానికి కనపడకుండా పైరిణీ రవికకు బరాబరు చేసింది. ఒకదానికి తరువాత ఒకటి జుబ్బా జాకెట్టు, జంపర్లు స్త్రీల ఊర్ధ్వ కాయాల మీద ఉజ్జ్వలంగా రాజ్యం చేస్తూ వచ్చినవి. మొదట్లో మగవాళ్ళూ, తరువాత జబ్బుగా ఉన్న ఆడవాళ్ళూ ఆంగ్ల దేశంలో ఉపయోగించిన జంపరు ఈ నాడు మన దేశంలో స్త్రీలకు నిచోళమైంది. 'పాంటలూన్' అనే ఒక జర్మనీదేశ తత్త్వవేత్త మొట్లో నేటి 'పంట్లం' వంటి దుస్తు కుట్టించుకున్నాడు. క్రమక్రమంగా అది యూరప్ దేశంలో 'ఫాష'నై మన దేశంలోకి దిగుమతైంది. 'నిక్కరు' మొదట్లో 'వాషింగ్టన్ ఇర్వింగ్' అనే ఒక రచయిత పెట్టుకున్న మారుపేరు. అతని దుస్తుకు నామమై నేడు క్రమంగా ప్రపంచమంతా ఏలుతూ ఉన్నది. 'బీరువా' ఎలా వచ్చిందో తెలియకుండానే గుడ్డలు పెట్టుకుంటున్నాము; నగలు దాచుకుంటున్నాము. ఫ్రెంచి భాషలో బీరువాకు 'ఒక బల్ల' అని అర్థం మొదట్లో. బీరువా అనే రంగుగుడ్డ వేయటం వల్ల బల్లకు ఆ అర్థం రూఢికెక్కింది. ఈ నాడు 'ఆఫీసు' మోటై 'బీరువా' అని పిలిపించుకుంటున్నది. పదాల చరిత్ర ఒక్కొక్కప్పుడు 'ఫార్సు'గా ఉంటుంది. 'ఫార్సు' ఫ్రెంచిమాట!
దుస్తులను గురించి చెప్పి అలంకరణాలలో మచ్చుకు ఒకటైనా చెప్పకపోవటం భావ్యం కాదు. 'అరవ చెవుల కేల అరిది వజ్రపు కమ్మ!' 'కమ్మ' శబ్దానికి లేత 'తాటిమొవ్వ' అని అర్థం. పూర్వం స్త్రీలు లేత తాటిమొవ్వను చుట్టచుట్టి కర్ణాలంకరణంగా ఉపయోగించేవారు. తరువాత ఆ 'కమ్మ' సంస్కృతీకరణంవలన 'తాటంక' మైనది. కర్ణాభరణ మనే సామాన్యార్థం వచ్చేసింది. ఎర్రరాళ్ళ కమ్మలూ,
410
వావిలాల సోమయాజులు సాహిత్యం-4