Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యక్తి నుద్దేశించి వ్యవహారంలో ఉండేది. కాలక్రమేణా దానికి జనసామాన్య వ్యతిరేక భావం కలిగింది.

దేశంలో రాజకీయాలు మారుతూ ఉంటే పూర్వ శబ్దాలను పదభ్రష్టాలను చేసి, వాటి స్థానాలను నూతన శబ్దాలు ఆక్రమిస్తూ ఉండటము నైజము. దండయాత్రల ఫలితంగా, దాస్యం కారణంగా భారతీయ భాషలన్నిటిలోనూ ఎన్నో అన్యదేశ శబ్దాలు వచ్చి చేరినవి. ముసల్మానులు మన దేశంలో ప్రభుత్వం చేసిన రోజుల్లో పన్ను పోయి తహశీలు, పాట పోయి ఇజారా, ఆరెకులు పోయి గస్తీలు, తప్పు బదులు జుల్మానా ఇత్యాదిగా ప్రవేశించినవి. తెలుగు రాజుల కాలంలో ఉన్న ఉద్యోగాలూ, ఉద్యోగస్థులూ మారిపోయినారు. వకీలు, సముద్దారు, సిరస్తాదారు, తహసిల్దార్, అమీనాలు రాజ్యపాలన చేయడం ప్రారంభించారు. ఇళ్ళలో వస్తువులు మారిపోయినవి. మేజా, మెల్లా, బావిడీ, కూజా, కుర్చీ, కిటికీలు వచ్చినవి. మిఠాయి, మసాలా, పూరీ, ఫేణీ, దూద్ పేడా, బర్ఫీ, హల్వా, జిలేబీ, పోణీ, కోవాలు తినడం నేర్చుకున్నాము.

ఫ్రెంచివారూ, బుడతకీచులూ మన దేశంతో వ్యాపారం చేసిన దినాలలో కొన్ని శబ్దాలు ప్రవేశించినవి. ఇంగ్లీషువారి నాగరికతా వ్యామోహంతో, రాజ్యపాలనతో మన భాషలో ఎన్నెన్ని శబ్దాలు ప్రవేశించి అప్రయత్నంగా ముసలమ్మకూ త్రోసిరాజనలేని పదాలుగా మారిపోయినవి!

'ముచ్చె తీసుకొని తంతాను', 'దమ్మిడీ ముండకు ఏగానీ క్షవరం' అనే ప్రయోగాలు పల్లీయుల వ్యవహారంలోనూ వినిపిస్తుంటవి. కాని, అవి ఎలా వచ్చినవో వారెరుగరు. 'ముచ్చె' పర్షియన్ పదము. 'దమ్మిడీ', గ్రీకు పదము. 'జముఖాణా' లేనిది బ్రాహ్మణ ముసలమ్మకు మంచంమీద నిద్రపట్టదు. అయితే ఆ వస్తువు మొదట లక్షిణీ దేశానిదనీ, ఆ పదము లక్టిణీ శబ్దమనీ ఆమెకు తెలియదు. తెలిస్తే తప్పకుండా తడిపి, కాసిని పంచితం నీళ్లు చల్లి పక్క వేసుకొనేది.

గ్లాసూ, కిరసనాయిలూ మనవి కావని తెలుసుకోబట్టే ఆమె ఈ నాటికీ గాజుసీసాలో నూనె పోయించుకోదు; మడితో కిరసనాయిలు లాంతరు ముట్టుకోదు. 'ఆసుపత్రి'కి వెళ్ళివస్తే, రైలులో ప్రయాణం చేస్తే ఇంటికి వచ్చి 'సచేలస్నానం' చేస్తుంది.

అన్య దేశాలతో సంబంధం లేకుండా నిత్య వ్యవహారం జరగదు. అప్పుడు ఇతర దేశశబ్దాలు భాషలో ప్రవేశించకుండా ఉండనూ ఉండవు. 'కోప్రా' శబ్దం వల్ల


సంస్కృతి

409