Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాబట్టి జువ్వి ప్లక్షమైనది. 'బిలతి శుష్టాదీన్ బిల్వః' కుష్ఠాదులను కొట్టివేస్తుంది కాబట్టి మారేడు బిల్వమైనది. ఆర్యభాష శబ్దజాలంలోనే విజ్ఞానాన్ని ఇముడ్చుకున్నది. ఈ రీతిగా శబ్దజాలాన్ని పరిశీలిస్తే అనంతవిజ్ఞానం కలగటానికి అవకాశమున్నది.

ఒక భాషలో పుట్టిన ఒక శబ్దం మరొక భాషలో ప్రవేశించి వేరు అర్థంలో ప్రయోగాన్ని పొందుతూ ఉంటుంది. మహారాష్ట్ర భాషలో పింగాణీ శబ్దానికి సీతాకోక చిలుక అని అర్థం. తెలుగు భాషలో ఇది 'పింగాణీ గిన్నె' అన్నటువంటి ప్రయోగంలో ఒక పదార్థానికి వాడుకలో ఉన్నది. దీనికి మొదట్లో చైనా, జపానుల నుంచి దిగుమతి అయ్యే పింగాణీ సామానుల మీద సీతాకోకచిలుక బొమ్మ ఉండటమూ, అవి బొంబాయి రేవులో దిగటమూ కారణము. సంస్కృత భాషలోని సంతాప శబ్దానికి మహారాష్ట్ర భాషలో కోపమని అర్థము. 'రాగ' శబ్దానికి వంగభాషలో కోపమని అర్థము.

ఆంధ్రభాషలో అనేక సంస్కృతశబ్దాలు తత్సమాలుగా ప్రవేశించి, అర్థ విపరిణామాన్ని పొందినవి. 'అనుమాన' మనే తార్కిక శబ్దానికి సంశయము, సంకోచము అని అర్థము వచ్చింది. 'ముష్టి' బిచ్చమైంది. 'దాహము' దప్పికగా మారిపోయింది. 'పూజ్యము' శూన్యార్థాన్ని సూచిస్తూ ఉన్నది. 'దేవానాంప్రియుడు' మూర్ఖుడైనాడు. 'పండితపుత్రుడు' శుంఠ. కైంకర్యం 'కాజేయుట' యైనది. 'దేవతార్చన' భోజనానికి పర్యాయపదమైనది. ఈ జాతిలోనే గీర్వాణము, తద్దినము, ఫలహారము, సంభావన, సంతర్పణ, స్వయం పాకము, స్వస్తి, కుశలము, అయోమయమూ ఇత్యాదులు.

కేవలం దేశీయ శబ్దాలు కూడా అర్థవిపరిణామాన్ని పొందక పోలేదు. 'కంపు' శబ్దము భారత రచనాకాలంలో సువాసనను సూచిస్తుంటే, నేడు దుర్గంధాన్ని పలుకుతున్నది. కన్నడ భాషలో నేటికీ 'కంపునూనె'కు గౌరవముంది. వాసన నూనెలకు వాడకం చేస్తున్నారు. నన్నయనాడు యౌవనవతిని తెలియజేసే 'అవ్వ' శబ్దం ఈ నాడు కాటికి కాళ్ళు చూచిన ముసలమ్మలను తెలియజేస్తుంది. యౌవనవతిని ఈ నాడు 'అవ్వ' అని సంబోధిస్తే జరగవలసిన మర్యాద జరిగి తీరుతుంది.

శబ్దాలు వలసపోతూ ఉంటవి. మృతి పొందుతవి. తిరిగీ పుడుతూ ఉంటవి. నూతనంగా సృజితమూ అవుతుంటవి. నేటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ వాతావరణంలో నిత్యమూ ధ్వనించే బూర్జువా శబ్దము మొదట పరిహాసాస్పాదుడైన


408

వావిలాల సోమయాజులు సాహిత్యం-4