Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దానికి ప్రాయశ్చిత్తంగా సారస్వతేష్టి చెయ్యవలసిందని 'ఆహితాగ్ని రపశబ్దం ప్రయుజ్య ప్రాయశ్చిత్తీయాం సారస్వతీం ఇష్టం నిర్వపేత్' అని అనుశాసించారు. 'దుష్టః శబ్దః స్వరతో వర్ణతోవా మిథ్యా ప్రయుక్తో న తదర్ధమాహ, స వాగ్వద్రో యజమానం హినస్తి యథేంద్రశత్రుః స్వరతోపరాధాత్' - స్వరం చేతనూ, వర్ణం చేతనూ దుష్టమైన శబ్దము వృథాప్రయుక్తమూ, అనర్థకమూ అయిపోవటమే కాదు. యజ్ఞకర్తను వజ్రమై హింసిస్తుందిట. దీనికి 'ఇంద్రశత్రు' శబ్దమే నిదర్శనము అని అన్నారు. 'ఇంద్రుడనే శత్రువు నశించుగాక!' అనే ఉద్దేశంతో క్రతువు చేసే దధీచి 'ఇంద్రశత్రు' శబ్దాన్ని 'ఇంద్రుని శత్రువు నశించుగాక!' అనే అర్థం వచ్చేటట్లు ఉచ్చరించటం చేత అతడే నశించాడు. శబ్దాన్ని బాగా తెలుసుకొని ప్రయోగిస్తే స్వరక్రతుకర్తకు కామధేను వౌతుందిట!

సంస్కృత భాషలో ప్రాతిశాఖ్యలూ, పాణినీయ శిక్షలూ, వ్యాకరణ శాస్త్రమూ శబ్ద స్వరూపాన్ని నిలపటానికే పుట్టినవి. అసంస్కృత, అనాగరిక భాషల్లో శబ్దానికి నిలకడ లేకపోవటం వల్ల అజ్లోపము, హల్లోపము, వర్ణపతి, ద్విత్వవికల్పము, హలాగమము, సంప్రసారణము ఇత్యాదులను పొందుతూ, సహజ స్వరూపాన్ని పోగొట్టుకుంటూ ఉంటుంది. అయితే జీవద్భాషలో ఎన్ని కట్టుదిట్టాలున్నా శబ్దానికి కొంతగా 'వికృతి' ఏర్పడటం తప్పదు.

శ్లేషకల్పనలకూ, ఉక్తివైచిత్రానికీ 'ఊత' ఎంతో ఉపకరిస్తుంది. ద్వ్యర్థి త్ర్యర్థి కావ్యజాలం ఉక్తి మీద ఆధారపడ్డది. అంటే ఊతమూలంగానే నడుస్తున్నదన్నమాట. శత్రురాజాస్థానంలో ప్రవేశించి ఆ రాజును పొగడినట్లు కనిపించి, నిజరాజాస్థానానికి తిరిగి వచ్చి శ్రీనాథమహాకవి ఊత సహాయం వల్లనే 'సర్వజ్ఞ నామధేయము... రావుసింగజనపాలునకే 'యుర్విం జెల్లును' అని విడగొట్టి ప్రభువు మెప్పు పొందాడు. 'అరచందమామ నేలిన దొరగా నెన్నుదురు నెన్నుదురు బిత్తకిన్, బరువంపు మొల్లమొగ్గల దొరగా బలుకుదురు పలుకుదురు జవ్వనికిన్' అన్న చేమకూరకవి ఉక్తి ఊతమీద ఆధారపడ్డదే!

ఏ భాషలోనైనా శబ్దజిజ్ఞాసకు పూనుకుంటే ఆశ్చర్యంతోపాటు విజ్ఞానమూ కలుగుతుంది; ప్రజ్ఞానమూ కలుగుతుంది. ప్రజ్ఞాన విషయం పూర్వము చర్చించు కున్నాము. ఇక విజ్ఞాన విషయము, శబ్దార్థాలను గమనిస్తే ఎంతో విజ్ఞానము కలుగుతుంది. ఉదాహరణానికి సంస్కృతభాషలోని ఓషధీవర్గ శబ్దాలను నాల్గింటిని పరిశీలిద్దాము. 'శిగ్రు' అనే శబ్దానికి 'మునగ' అర్థము. 'శినోతి శమయతి కఫాదీన్ శిగ్రుః' శ్లేష్మాదులను పోగొట్టుతుంది కాబట్టి దీన్ శిగ్రువైనది. కఫదోషాన్ని భక్షిస్తుంది


సంస్కృతి

407