Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'పూల కడుపులలో తేనె పోసె నెవడొ,
దాని తీయు నేర్పు తుమ్మెదకు లభించె;
భాషలోని మాధుర్య లావణ్యభావ
సాధుభోగము కవిముఖ్యసాధ్య మయ్యె

అన్నాడు రాయప్రోలు. కవులు రసపిపాసువులు, రసలోలుపులు, శబ్దశక్తి వారెరిగినట్లు ఇతరు లెరుగరు. భావగోపనం చెయ్యటంలో వారు మాంత్రికులు. ఒకానొక సందర్భంలో వాల్టేరు మహాశయుడు One great use of words is to hide our thoughts' అన్నాడు.

పదజాలానికి మూలాలు ఏమిటని భాషాశాస్త్రవేత్తలు జిజ్ఞాస చేశారు. అర్థవత్తులైన సూక్ష్మతర రూపాలు శబ్దజాలానికి మూలకారణాలని తేలింది. వాటికే మనవారు ధాతువులని నామకరణం చేశారు. ఇవి కేవలం రసాయన శాస్త్రంలోని మూలవస్తువులకు (Elements) తుల్యమైనవి. వీటికి చాలా భాషల్లో స్వతంత్ర ప్రయోగముండదు. ఇవి అనాది మానవుడు ఉచ్చరించిన పరిపూర్ణ వాక్యాలకు పరిణామ రూపాలు. కాలక్రమేణా పరిణామాలను పొంది పొంది నిలిచిన అవశిష్టరూపాలు.

మహాకవి కాళిదాసు పార్వతీపరమేశ్వరులను 'నాగర'ములతో పోల్చి ధ్యానించాడు. పార్వతి ఉంటే పరమేశ్వరుడున్నట్లే. పరమేశ్వరుడున్నా పార్వతి ఉన్నట్లే. శబ్దము ఉన్నదంటే అర్థము ఉన్నదన్నమాటే! అయితే ఈ శబ్దానికి ఈ అర్ధము అని ఎలా రూఢికి వచ్చింది? గ్రీకు దేశంలో అరిస్టాటిల్ అనే భాషావేత్త శబ్దార్థ సంకేతాన్ని జిజ్ఞాస చేసి, అనాది మానవులకు శబ్దార్థ సంకేత విషయంలో ఒక ఒడంబడిక కుదిరి ఉంటుంది అన్నాడు. డార్విన్ మహాశయుని పరిణామ వాద సిద్ధాంతాన్ని అనుసరించి మనుష్యులకు భాష (శబ్దార్థాలు) వారి పూర్వరూపాలైన వానరుల కిచ కిచలనుంచి వచ్చిందని ఊహించవచ్చును.

'సంకేతస్తు పదపదార్థయో స్సంబంధః' అని మహర్షి పతంజలి స్ఫోటవాదం నిలబెట్టినాడు. నైయాయికులు 'శక్తం పదం' అన్నారు. పదానికి, పదార్థానికి ఉన్న సంబంధం ఈశ్వరేచ్చారూపకమని వారి అభిప్రాయం. అయితే వైయాకరణులు ఈశ్వరేచ్ఛను అంగీకరించలేదు. పదానికీ, పదార్థానికీ ఉన్న సంబంధం కేవలం వృత్తిరూపకమనీ, తాదాత్మ్యసంబంధమైనదనీ వారి అభిప్రాయం. ఈ సంబంధం వారి మతంలో నిత్యము. కంటికి చూడటమూ, చెవికి వినటమూ ఏ నాడు కలిగిందో ఎలా చెప్పలేమో, అదేరీతిగా శబ్దానికి అర్థం కూడాను అని వారంటారు. శబ్దార్థ సంబంధం అనాది అని వారి మతం.


404

వావిలాల సోమయాజులు సాహిత్యం-4