Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక క్రూరమైన మృగాన్ని మాలిమి చేసుకోవచ్చును. ఆలనా పాలనా లేకుండా అయోమయంగా పెరిగిపోయిన అడవిని అదుపులో పెట్టి అందమైన మార్గనిర్మాణం చెయ్యవచ్చును. కానీ అజాగ్రత్తతో ఉచ్చరించిన ఒక విషశబ్దం వల్ల కలిగే ప్రమాదాన్ని తప్పించుకోలేము. 'మాటలో ఏముంది మనసు లొకటైతే చాలు' ననుకోవటం మనకు పరిపాటి. అయితే మనస్సు ఒకటి కావటానికి మాటే ప్రధానమని మనం మరిచిపోకూడదు. నిశితమైన నిస్త్రింశిక కంటే హృదయ విదారణ శక్తి శబ్దానికే ఎక్కువ ఉంది. 'మాటలలో ప్రయోజనమేముంది, పని చూపాలి' అని కూడా లోకంలో వింటుంటాము. ఒకప్పుడు మాటే పనికంటే సహస్రాధికంగా పనిచేస్తుంది. అది వచ్చే సమయాన్ని బట్టీ, అందుకునే వ్యక్తినిబట్టీ, అనే వక్తను బట్టీ అర్థభేదాలు ఏర్పడుతూ, భావచ్ఛాయలు గోచరిస్తూ ప్రళయ ప్రణయాలు కలగటానికి శబ్దం తోడ్పడుతుంటుంది. అది ఒక జాతిని అభ్యుదయపథం పట్టించనూ గలదు; అధోగతికి చేర్చనూ గలదు.

శబ్దతత్త్వం తెలిసినవారికి శబ్దం పతివ్రత వంటిది. నిత్యమూ వారి భావాలను అనుసరిస్తూ ఉంటుంది. 'కార్యేషు దాసీ' మొదలు 'శయనేషు రంభా' వరకూ అనురక్తగా ఉంటుంది. శబ్దతత్త్వం తెలుసుకుని భ్రమ పడేవారికి జారిణిగా వ్యవహరించి, తళు కు బెళుకులతో, తరితీపి ధ్వనులతో ఆకర్షించి శుభ్రంగా 'సుబ్బిసెట్ల'ను చేసి కూర్చోబెడుతుంది. శబ్దం అతి చిత్రమైంది.

శబ్దం ధర్మార్థ కామాలను అభివ్యక్తం చేస్తుంది. గృహమర్యాదలూ, సంఘ మర్యాదలూ, సంబంధ బాంధవ్యాలూ, రాజ్యాలనూ, లోకాలనూ, విశ్వాలనూ, దేవతనూ, పరబ్రహ్మనూ తెలియపరుస్తుంది.

శబ్ద సంస్కారం లేకపోవడం వల్ల 'మోదకైః తాడయ మాం' కథవల్ల శాతవాహన మహారాజంతటి వాడు అవహేళన పొందినాడు. 'మాహిషం చ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి' అక్షరలక్ష లిప్పించింది.

శబ్దం అనేక అంచులు ఉన్న రత్నం. ఆ రత్నశిల్పి లోకంలో ఒక మానవుడి జీవితాన్ని వసంతం చేయకలడు; నిదాఘం చేసి నిర్మూలం చెయ్యనూ గలడు. మానవుని తత్త్వవివేచనశక్తీ, జిజ్ఞాసా శబ్ద జాలంమీద ఆధారపడి ఉంటాయి. అది అధికమైనప్పుడు అధికమూ, స్వల్పమైనప్పుడు అల్పమూను.

జాన్సన్ మహాశయుడు ఒకచోట 'Words are the daughters of the earth and deeds are the sons of heaven' అన్నాడు. ఆ శబ్దశక్తి అనంతమైనది;


402

వావిలాల సోమయాజులు సాహిత్యం-4