తంత్రము. ఇది లోపాముద్రవిద్యను సూచిస్తున్నదని కొందరు వ్యాఖ్యాతలు వ్రాసినారు. ఇది గురుముఖతః గ్రహించవలసిన శబ్ద స్వరూపము.
సంగీత శాస్త్రమూ శబ్దాన్ని బ్రహ్మంగా పరిగణిస్తున్నది. పరమభక్తాగ్రేసరుడూ, వాగ్గేయకార ప్రముఖుడూ, ఋషితుల్యుడూ అయిన త్యాగరాజ స్వామి 'నాదతనుం అనిశం శంకరం' అని ధ్యానించాడు బ్రహ్మ స్వరూపాన్ని. కేవలం నాదోపాసనవల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జన్మించారని ఆయన 'నాదోపాసన చేసి శంకర నారాయణు లన వెలసిరి ఓ మనసా' అని పాడుకొన్నాడు.
'నకారం ప్రాణనామానం దకార మనలం విదుః, జాతః ప్రాణాగ్ని సంయోగా త్తేన నాదోభి ధీయతే' అని శబ్దాన్ని సంగీతదర్పణం నిర్వచిస్తూ ఉన్నది. ప్రాణానల సంయోగం వల్ల నాద మేర్పడుతున్నదని భావము.
ఈ నాదము (శబ్దము) వర్ణాత్మకమూ, ధ్వన్యాత్మకమూ అని ద్వివిధము. 'అ ఇ ఉణ్, ఋ, క్' ఇత్యాది మాహేశ్వర సూత్రాలవల్ల అజల్విభాగాన్ని పొంది వేద వేదాంగాలకూ, సమస్త వాఙ్మయ సాహిత్య ప్రపంచాలకూ మూలంగా పరిణమించింది. వర్ణాత్మక నాదం, అధిదేవత, జాతి, మిత్రత్వమూ, శత్రుత్వమూ, లింగమూ, కాంతి, విష అమృతేత్యాది గుణరూపాలు వర్ణాత్మక శబ్దానికి లక్షణాలు. ఇందలి ఆయా వర్గాలకు మాతృకాన్యాసంలో అంగన్యాస కరన్యాసాలు నిరూపితాలై ఉన్నవి.
ధ్వన్యాత్మకమైన శబ్దం ఆహతము, అనాహతమూ అని రెండు విధాలు. ఈ రెంటిలో అనాహతము రేచకపూరకాదుల వల్ల మూలాధార స్వాధిష్ఠాన మణిపూరాది చక్రాలకు నాదాన్ని రేపి, కేవలం మహాయోగులకు మోక్ష సాధకమవుతున్నది.
రెండవది ఆహతము. నాదతరంగాలను శ్రుతి పుటాలో ప్రవేశపెట్టి 'ఆనందో బ్రహ్మ సూత్ర సమన్వయం చేయగల శక్తిమంతమైన సంగీతానికి మూలము. ఇదే సామానికి మూలం. సారూప్య మోక్ష సాధనము. 'మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు సాక్షాత్కార నీ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు' అని త్యాగయ్యచే అనిపించుకున్న సంగీతానికి ఆధారము.
నాదమనే పేరుతో వ్యవహారంలో ఉన్న శబ్దము సప్తస్వరాలతో లోకపూజ్యమై ఉన్నది. ఈ ఆహతనాదశక్తి అత్యద్భుతమైనది. 'శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః' అన్న వచనం లోక ప్రసిద్ధమైనది. అంతేకాదు, దేవతలకు కూడా ఆహత శబ్దం మీదనే అత్యంతాభిమానమట!
400
వావిలాల సోమయాజులు సాహిత్యం-4