వషట్కార స్వ మింద్ర స్వగ్ం రుద్ర స్త్వం విష్ణు స్త్వం బ్రహ్మాత్వం ప్రజాపతిః' అని రూపిస్తున్నది. బ్రహ్మమే శబ్దము అయినప్పుడు ఉపాసకుల కార్యార్థము బ్రహ్మము రూపకల్పన పొందటము వల్ల కలిగిన దేవత లందరూ శబ్ద స్వరూపులు. మన వర్ణ సమామ్నాయము 'అ' కారముతో ప్రారంభించి 'హ' కారంతో అంతమొందుతుంది. అందువల్ల ‘అహమ్' అనే శబ్దము సమస్త ప్రపంచాన్నీ నిరూపించటానికి యోగ్యమైనది. 'అ' కారము శివస్వరూపము; నిర్గుణము. 'హ' కారము శక్తి స్వరూపము; సగుణము. శివశక్తి స్వరూపమైన అహంకారము కామకళాస్వరూపంతో జగద్రూపాన పరిణమించింది. అక్షర సమామ్నాయము బ్రహ్మరాశి, పుష్పించి పుష్పించి అది చంద్రతారకంగా విరాజిల్లుతున్నది అన్నాడు పతంజలి మహర్షి. అందువల్ల శబ్దమే దేవత. మంత్రము దేవత. యాజ్ఞవల్క్య మహర్షి ఆహ్నిక సూత్రాలలో ఇలా అన్నాడు
'యస్య యస్య చ మంత్రస్య ప్రోద్దిషాయాచ దేవతా
తదాకారం భవేత్ తస్య దైవతం దేవతోచ్యతే'
మంత్రరూపమే దేవతారూపము; మంత్రమే దేవత అని తాత్పర్యార్థము. ఈ సూక్ష్మాన్ని అనుసరించే మాతృకాన్యాస తంత్రం బయలుదేరింది.
దేవతలు కేవలం శబ్ద స్వరూపులే కాదు; శబ్ద గమ్యులు కూడాను. ప్రతి దేవతను గురించీ అష్టోత్తరశతాలలో 'శబ్దగమ్యాయ' అని కనుపిస్తుంది. ఆచార్య శంకరపాదులు 'సౌందర్యలహరి'లో 'ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో, హరార్ధం ధ్యాయే ద్యోహరమహిషితే మన్మథ కలామ్, న సద్య స్సంక్షోభం న యతి వనితా ఇత్యతిలఘు, త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందు స్తనయుగామ్' అని వర్ణించాడు దేవిని. 'హరార్ధం' అనటంలో 'శివార్ధం' - అర్ధనారీశ్వర రూపము వ్యక్తమౌతున్నది.
'శివః శక్తిః కామః క్షితి రథ రవి శ్శీతకిరణః
స్మరోహంసః శక్రః తదనుచ పరా మార హరయః
అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితా
భజంతేవర్ణా స్తే తవ జనని నామావయవతామ్'
శివ (క), శక్తి (ఏ), కామ (ఈ), క్షితి (ల), రవి (హ), శీతకిరణ (స), స్మర (క), హంస (హ), శక్ర (ల) - వర్ణాలతో హ్రీం కారాలను మూడు చివరలా కూరిస్తే తల్లీ, నీ నామధేయానికి అంగ మౌతుందని సౌందర్యలహరిలోనే భగవత్పాదులు అన్నారు. క, ఏ, ఈ, ల, హ్రీం, హసకహల హ్రీం, సకలహ్రీం - ఇదే దేవనామాత్మకమైన నూతన
సంస్కృతి
399