Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబ్దమూ - శబ్ద సంపదా

"దైవీం వాచ మసృజంత దేవాః, తాం విశ్వరూపాః పశవో వదంతి"

నేను మాట్లాడుతున్నాను నాకీ 'మాట్లాడటం' ఎలా వచ్చింది? ఈ జిజ్ఞాస ప్రారంభిస్తే తేలే సారాంశము : చిన్నతనంలో మా అమ్మా, నాన్నా నాకు కొన్ని శబ్దాలు నేర్పారు; తరువాత మా గురువు కొన్ని నేర్పారు; గ్రంథజాలం వల్ల నేను కొన్ని నేర్చుకున్నాను; ఈ శబ్దసంపదంతా నేను ఒకనాడుగా సేకరించుకున్నది కాదు అని తేలుతుంది. భాషాశాస్త్ర పరిభాషలో చెప్పవలెనంటే నాకు భాష సంఘమూలకంగా వచ్చిందనవలసి వస్తున్నది.

అయితే, నా కాలంవారికి శబ్దజాలం ఎలా వచ్చింది? పూర్వులనుంచి అని సమాధానం. వారి పూర్వులకో వారి పూర్వుల నుంచి. ఇలా పోగా పోగా అనాది మానవ సంఘం దగ్గిరకూ, అనాది మానవుడి దగ్గరకూ చేరుకుంటాము.

అప్పుడు అనాది మానవుడికీ శబ్దజాలం ఎలా వచ్చింది అనే జిజ్ఞాస కలుగుతుంది. అతడు పరిసరాలలో ఉన్న ఆయా వస్తువులను ఆయా శబ్దాలతో పిలుద్దామని ఏర్పాటు చేసుకొని ఉంటాడేమో అని అనిపించవచ్చును. లేదా జంతులోకం మధ్య తానూ ఒక జంతువుగా వ్యవహరిస్తూ, సుఖదుఃఖాలను వెల్లడి చేసుకుంటాడని జంతుజాలం చేసే శబ్దాలను అనుకరించటము నేర్చుకొని ఉంటాడు అని తోచవచ్చును. లేకపోతే అనాది మానవుడు సుఖదుఃఖాది ద్వంద్వాలమధ్య చేసే అవ్యక్త ధ్వనులవల్ల భాషలో శబ్దజాలం ఏర్పడి ఉండవచ్చును అని ఆలోచన నడవవచ్చును.

భారతీయ విజ్ఞానము శబ్దము నిత్యమనీ, సృష్టితోనే ప్రారంభమైనదనీ, సృష్టికి అదే మూలమనీ పలుకుతున్నది. 'వాగేవ విశ్వా భువనాని జజ్ఞే', 'వాక్ తంత్రిః నామాని దామాని తస్యేదం వాచా తంత్ర్యాః నామభిః దామభిః సర్వం సితం' (సర్వమూ వాక్కువల్లనే పుట్టింది, దండలో దారం వలె అది సమస్తములోనూ అనున్యూతంగా ఉన్నది) అనే శ్రుతి వచనాలు ఇందుకు ప్రమాణం. 'నామరూపే వ్యాకరోత్' అనే దానివల్ల ఉపనిషత్తు సృష్టికర్తే శబ్దాన్ని సృజించాడని ప్రవచిస్తున్నది.


396

వావిలాల సోమయాజులు సాహిత్యం-4