Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గడియారము

భారతీయుల సంవత్సరము ప్రధానంగా సౌరమానాన్ని అనుసరించి పరిగణితమౌతున్నది. భారతీయుల సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు క్రాంతి వృత్తము (Ecliptic) నిర్ణీతమైన వర్తులముపై గమిస్తాడు. ఈ క్రాంతి వృత్తము 27 భాగాలుగా విభాజితమై ఉంది. ఒక్కొక్క భాగానికి ఒక నక్షత్రమని నామము.

సూర్యుడు అశ్వినిలో ప్రవేశించటంతో భారతీయుల సంవత్సరం ఆరంభిస్తుంది; రేవతితో అంతం పొందుతుంది. వైదికకాలంలో కూడా సంవత్సరపరిగణనం ఇదేవిధంగా ఉండేది. ఋగ్వేద సంహితలలోనూ, యజుర్వేద సంహితలలోనూ ఈ విషయాన్ని నిరూపిస్తూ అనేక మంత్రాలు కనిపిస్తున్నవి. ఉదా :

అభోద్యగ్నిర్ణ ఉదేతి సూర్యో వ్యుషరశ్చంద్రా మహ్యామో అర్చిషా |
ఆయుక్షతా మశ్వినీ యాతవే రథం ప్రాసావి ర్దేవః సవితా జగత్పృథ

(ఋగ్వే. 1.154.1)

పాసాత్యౌ చిత్రా జగతే నిధానౌ
ద్యావా భూమీ చరధః సం సఖాయౌ |
తా వాశ్వినీ రాసభస్వా హవం మే
శుభసృతీ ఆగతం సూర్యయా సః ॥

(తైత్తిరీ యారణ్యకము (1.10.2)

వీటిని బట్టి వైదికకాలంలోని సంవత్సరము సూర్యుడు అశ్వినిలో ప్రవేశించినప్పుడే ప్రారంభ మైనదని మనకు అర్థమౌతున్నది. అంటే వేదకాలారంభం నుంచీ నేటివరకూ సంవత్సరం ఒకేరకంగా ఆరంభమై, అంతం పొందుతున్నదన్నమాట.

సంవత్సరము రెండు భాగాలు: దేవ అహస్సు, దేవరాత్రి. దేవ అహస్సులో సూర్యుడు అశ్విని నుంచి పునర్వసు మీదిగా చిత్ర చేరుకుంటాడు, దేవరాత్రిలో చిత్రనుంచి ఉత్తరాషాఢ మీదుగా మరల అశ్విని చేరుకుంటాడు.

సంవత్సరానికి - వసంతము, గ్రీష్మము, వర్ష, శరత్తు, హేమంతము, శిశిరము - ఆరు ఋతువులు. వసంతము సౌర సంవత్సరంతోనే ఆరంభ మౌతుంది. సంవత్సరము వసంతంతో ఆరంభిస్తుంది.


సంస్కృతి

393