Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏ నాడు సద్గురు శాస్త్రాలు “నీవు కేవల చైతన్య స్వరూపుడవే కనుక ఈ దేహాదులు నీ రూపాలు కావు. ఈ దేహాదులు చొక్కాల వంటివి. అందువల్ల ఈ దేహాదులకు కలిగే బాధలు నీకు ఎంత మాత్రం అంటవు. దేహాదులు ఎప్పుడు జీవరూపాలు కావో - అంటే వానికంటే చేతన రూపుడయిన జీవుడు వేఱయిననాడో - అప్పుడు సర్వజీవుల్లో కనుపించే చైతన్య మొక్కటే అనీ, ఒకే సూర్యుడు నానాతరంగాలలోనూ ప్రతిబింబిస్తూ అనేకాలుగా కనబడినట్లు, ఈ ఒకే ఒక చైతన్యం నానావిధ శరీరాలనే ఉపాధులు భేదం చేత భిన్న భిన్నములుగా కనబడుతున్నదనీ, వాస్తవం చేత ఈ చైతన్య మొక్కటే అనీ, ఈ చైతన్యమే జగత్కారణమైన బ్రహ్మమనీ, అందువల్ల నీవు జగత్కారణమైన బ్రహ్మమువే (తత్ త్వం అసి) అనీ చేసే ఉపదేశాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అప్పుడు ఆ సాధకుడు "అహం బ్రహ్మా స్మి" అనే జ్ఞానాన్ని అందుకొని అఖండ విజ్ఞానానంద రూపమైన స్వస్వరూపమందే లీనమౌతుంటాడు. ఈ అర్థాన్నే "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి" అన్న శ్రుతి చెపుతున్నది. అట్టి ముక్తుడు తన రూపాన్ని సర్వ ప్రాణులలోనూ, సర్వ ప్రాణులనూ తనలోను చూస్తుంటాడు.” ("తనయందు సకల భూతములందు నొక భంగి" అని భాగవతము) అనీ వేదాలు చెపుతున్నవి. "జగత్కారణమూ, స్వస్వరూపమూ అయిన బ్రహ్మము సత్ - చిత్ - ఆనంద - స్వరూపుడే గాని కరచరణాద్యవయవ విశిష్టుడెంత మాత్రం కాజాలడు అట్టి రూపాలు వాస్తవరూపాలు ఎంతమాత్రం కావు” అని శాస్త్ర హృదయము. పరమేశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించి, తానే జీవరూపంతో అందులో ప్రవేశించాడు గనుక, జీవుడు పరమేశ్వర రూపుడే అన్న విషయం "తత్ సృష్ట్వా త దేవాను ప్రావిశత్, అనేన జీవే నాత్మనా ప్రవిశామి” మొదలైన శ్రుతుల చేత చెప్పబడింది.

పూర్వం తెలిసిన సకలకర్మలకు గానీ, సకల ఉపాసనాదులకు గానీ ఇట్టి మోక్షస్థితి యందే పరమతాత్పర్యం అని వైదిక సిద్ధాంతం.


392

వావిలాల సోమయాజులు సాహిత్యం-4