Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇట్టి దైవానుగ్రహ సంపాదనకు పరమేశ్వరారాధనం ప్రధానం. సర్వవ్యాపకమైన విద్యుచ్ఛక్తిని కొన్ని సాధనాలతో పరిమితం చేసి, ప్రత్యక్షం గావించుకొని తత్ఫలాలను మనం అనుభవిస్తున్నట్లు సర్వ వ్యాపకుడు, సర్వశక్తిసంపన్నుడు అయిన పరమేశ్వరుడు ఒకే పరిమిత భావాన్ని సహజంగా పొంది ఉండకపోయినప్పటికీ, మంత్ర తంత్రాది శాస్త్రవిధానం చేత పరిమితాలైన మూర్తులందూ (విగ్రహాలు, సాల గ్రామాలు మొదలైన వానియందూ) ధ్వనిరూపాలైన మంత్రాలందు, పరిమితం గావించుకొని తదనుగ్రహాన్ని పొంది, మనం తత్ఫలితాలను పొందవచ్చునని శాస్త్రాలు చెప్పుతున్నవి.

ఒక వ్యక్తి పుత్ర, మిత్ర, కళత్ర, శత్రు, రూప, గ్రహీతృభేదం చేత నానా విధానాలను పొంది, ఆయా ఫలాలను వారి వారికి అందించనట్లు ఈ పరమేశ్వరుడు సైతం ఈ ఉపాసకుని అంతరంగభేదం చేత భిన్నభిన్నంగా స్వీకరింపబడుతుంటాడు. అంతేగాక ఒకే పరమేశ్వరుని స్త్రీ రూపంగానైనా, పుం రూపంగానైనా లేక కళారహిత రూపంగానైనా భావన చేస్తూ (ధ్యానిస్తూ) మనం తత్ఫలాన్ని పొందగలమని "స్త్రీ రూపం చింతయే ద్దేవం పుంరూపం నా విచింతయేత్ అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహమ్" ఈ విధంగా శాస్త్రం పేర్కొంటున్నది. దీనిని బట్టి దేవతా రూపాలు అనేకవిధాలుగా ఉన్నప్పటికీ, వాస్తవం చేత అవి అన్నీ ఒకే దేవతకు చెందిన విభిన్న రూపాలనీ, ఆయా భక్తులందరూ తమచేత పూజింపబడే దేవతారూపాలను కేవలం పరమేశ్వర రూపంతోనే ధ్యానిస్తారనీ తెలిసికోవలసివుంది.

పైన తెలిపిన పద్దతిలో ఉత్తమ భక్తుడై పరమేశ్వరాధనను తన వర్ణాశ్రమాలకు విధింపబడ్డ కర్మానుసారం ఆచరిస్తూ అంత్యాన శరీరత్యాగం చేసినవాడు, ఆయా పుణ్యానికి అనుకూలమైన లోకాన్ని పొంది, అందులో తన పుణ్య పరిమితికి తగినంత కాలం ఆ పుణ్య ఫలమైన సౌఖ్యాలను అనుభవించి, కొంచెం పుణ్యం మిగిలి ఉండగానే శేషపుణ్యకర్మతో మళ్ళీ భూలోకాన ఆ పుణ్యకర్మకు అనుకూలమైన జన్మను పొందటం జరుగుతుంది. ఇదే గీతలో

"తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి"

అని చెప్పబడింది. ఇదే విధంగానే పాపఫలాన్ని ఆయా నరకస్థానాలలో అనుభవించి, ఆ పాపం క్షీణింపగా మిగిలిన కించిత్పాపంతో దాని కనుకూలమైన భూప్రదేశాన సూకరాది జన్మలను పొందటం జరుగుతుంది. దీనిలో ఒక విశేషముంది. మృతులైన జీవులు ఎలా పుణ్యలోకాలకు వెళ్ళుతున్నారో, అట్లాగే అక్కడ పుణ్యానుభవం ముగిసిన


390

వావిలాల సోమయాజులు సాహిత్యం-4