Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శరీరాలు వాసనలు (సంస్కారాలు)

సర్వపాపాలకూ స్థూలమూ, సూక్ష్మమూ, కారణమూ అనే మూడు రకాలైన శరీరాలున్నవి. చేతనుడైన జీవుడు ఈ శరీరాలలో ఉంటాడు. స్థూలశరీరం మరణాదుల్లో పతనాన్ని పొందినప్పటికీ, సూక్ష్మశరీరం నిలిచే ఉంటుంది. ఇది గోచరం గానిది. దీనితోనే జీవుడు లోకాంతరాల్లో సుఖదుఃఖాలను తన కర్మానుసారం అనుభవిస్తూ ఉంటుంటాడు. మనుజుడు దుస్తులను ధరించి విడుస్తున్నట్లు ఈ సూక్ష్మశరీరంతో గూడిన జీవుడు (జీవచైతన్యం) తన పుణ్యపాపాలవల్ల వచ్చే ఆయా రూపాలయిన స్థూలశరీరాలను జన్మసమయాన ధరిస్తూ మరణసమయాన విడుస్తుంటాడు. శరీరాలు మారినా వాటిలోని సూక్ష్మ శరీరం ఒక్కటే అవటం చేత, ఆయా పూర్వజన్మల్లో తనకు గలిగిన వాసనలను (సంస్కారాలను) మాత్రం తాను పొందే ఉంటాడు. కనుక పూర్వజన్మ సంస్కారాలు తరువాతి జన్మల్లో అజ్ఞాతంగా పనిచేస్తూ ఉంటాయని వేదమత సిద్ధాంతము. అలాగే పూర్వజన్మకృతాలైన పుణ్యపాపాల కర్మలకు చెందిన ఫలాలైన సుఖదుఃఖాలనే జీవుడు అనుభవిస్తూ ఉంటాడనీ, చేసిన పుణ్యపాప కర్మలు అనుభవించనిదే క్షీణింపవనీ, “నా భుక్తం క్షీయతే కర్మ” అనీ ఈ వేద సిద్ధాంతము. పాప కర్మాలను కొంతగా క్షీణింపజేసుకొనటానికి ప్రాయశ్చిత్తాలు సైతం ఉపయోగపడతాయని ధర్మశాస్త్రం చెపుతున్నది. ప్రాణులు ఎట్టి పాపకార్యాలు ఆచరిస్తారో వాటిని అనుసరించే పరమేశ్వరుడు వారికి ఆయా సుఖదుఃఖాలు కలుగజేస్తాడు గాని, ఆయన కేవలం తన బుద్ధ్యనుసారంగా మాత్రం ప్రాణులకు సుఖదుఃఖాలను కలుగజేయడు. కర్మలను నిమిత్తంగా చేసుకొని ప్రాణులకు ఫలాలను ఇచ్చేవాడు ఈశ్వరుడే అవటం వల్ల, మనుష్యులకు ఈశ్వరానుగ్రహం సైతం ఆవశ్యకమౌతున్నది. ఇలా ఒక బీజం అంకుర భావాన్ని పొందటానికి ఆ బీజానికి ఉన్న బీజశక్తి, జలశక్తీ రెండూ ఎలా ఆవశ్యకాలో అలాగే జీవుడు తాను ఆచరించిన కర్మఫలానికి స్వప్రయత్న రూపమైన కర్మశక్తీ, పరమేశ్వరానుగ్రహరూపశక్తీ అంటే ఉభయశక్తులూ అవసరాలే. ఈ విషయాన్ని బాదరాయణ మహర్షి బ్రహ్మ సూత్రాల్లోని "కృత ప్రయత్నా తేక్షస్తు" (2-3-42) అన్న సూత్రంలో వివరించి ఉన్నారు. అందువల్లనే ఒకానొక కార్యం కేవలం పురుష శక్తిపై గానీ, లేదా కేవల పరమేశ్వరానుగ్రహంపై గానీ ఆధారపడదని ఆర్ష సిద్ధాంతము.


సంస్కృతి

389