విష్ణు మహేశ్వర స్వరూపులు. ఇట్టి గురువుల్లో భారతీయులకు అగ్రగణ్యుడు వ్యాస భగవానుడు. ఈయనను అర్చించటం ఆర్జించటం కోసం అగ్రహారాది మహాదానాలను గావించేది, విశేషంగా యీ మకర సంక్రాంతి పుణ్యకాలంలోనే.
భారతీయులు ఈ విధంగా పర్వదినాలలో దేవ, గురుదేవ, పితృదేవతలను అర్చించి, వారి యెడ ఋణాలను తీర్చుకోవటం మూలంగా ఆది భౌతిక ఆధాన చిత్త సంస్కృతిని పొంది, శిష్యశిక్షణకోసం దాన్ని ప్రదర్శిస్తుంటారు. పర్వదినాల్లో త్రివిధ దేవతలను ఆహ్వానించి షోడశోపచారాలను సమర్పించి, తిరిగి నూతన సంవత్సరం వచ్చి ఉద్వాసన చెప్పేటంత వరకూ నడిచే తంతు, భారతీయుల సంస్కృతీ, వైవిధ్యాన్ని బహుళ కోణాలలో ప్రదర్శిస్తుంది. పర్వదినాలో ఈ త్రివిధ దేవతార్చన సమయాల్లో భారతీయులు పాటించ వలసిన సామాన్య లక్షణాలుగా స్మృతి గ్రంథాలు నిర్దేశించిన ఇంద్రియ నిగ్రహం, సహనం, శుచిత్వం, సత్యప్రియత్వం, అతిథి పూజాపరత్వం, యజనయాజన యాజమాన్యాచరణం, పరద్రవ్యాపహరణవైముఖ్యం, ఉపవాస, జాగరణాదులు వారు సాధించిన సంస్కృతీవిశేషానికి కొన్ని సూచికలు మాత్రమే. సస్యం సమర్పించగా సంప్రాప్త మౌతున్న సంక్రాంతి వంటి పర్వదినాల్లో సర్వజనులూ పట్టణ నగర గ్రామీణ బాహ్యాలంకార గృహాలంకరణ గావించుకొని, అభ్యంగన స్నాన, నూతన వస్త్రాలంకరణలు చేసుకొని, ఏకాంత (వ్యక్తి) సమష్టి సంగీత నాట్య విలసనలతోటీ, స్త్రీ పురుషులు వివిధ రంగాలలో ఆర్జించిన విద్యావిశేషాలతోటీ ప్రేక్షకులను సంతోషపరచటం అనే ఆలోచనతో పరికిస్తే, భారతీయుల పర్వదిన విజ్ఞాన వైయాత్యం ఎంత బహుముఖీనమూ, ఘనతరమూ అయినదో అభివ్యక్త మౌతుంది.
23-6–న విజయవాడ ఆకాశవాణిలో చేసిన ప్రసంగం
388
వావిలాల సోమయాజులు సాహిత్యం-4