Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం మన ప్రాచీనతాదృష్ట్యా ఆవిర్భవించిన అంటే మన పూర్వ మహర్షులు దర్శించిన, విశ్వ విజ్ఞానాన్ని ఆర్జించటం ఎంతైనా అవసరం. జ్యోతిర్గణిత శాస్త్రరీత్యా కల్పాదితో స్పష్టంగా సంబంధం ఉన్నట్లు గోచరిస్తున్న ఉగాదినాడు, సంవత్సర పురుషుడికి పర్వదినం చేసి భారతీయులలో ఒక శాఖవారు సాంవత్సరిక కర్మారంభం గావించటం పర్వదిన దృష్టితోనే. భాద్రపద కృష్ణ పక్షంలోని మహాలయ అమావాస్య అయిన తరువాత వచ్చే శరన్నవరాత్రుల్లో ప్రధానంగా సృష్టి, స్థితి లయ శక్తి దేవతలైన సరస్వతీ, లక్ష్మీ, దుర్గలను పూజించి పొందిన యోగసిద్ధి దినాన్ని, వారు బహువిధరూపాల విజయదశమిగా భావిస్తారు. ఒక శాఖవారి దృష్ట్యా ఆదిదేవుడైన మహాదేవుడు లింగోద్భవ మూర్తిగా ఉద్భవించిన అంశాన్ని నిరూపించటానికి ఉద్దేశితమైన శివరాత్రి సర్వ సృష్టీ తమస్సుతో నాగతేజోద్భూత మౌతుందన్న విజ్ఞాన రహస్యాన్ని వ్యక్తీకరిస్తుంది. భారతీయ దేవతల చిత్రవిచిత్ర రూపాలకూ, వారిని అర్చించే దినాల నాటి నక్షత్రాల లక్షణ విశేషాలకూ ఉన్న సంబంధాన్ని జ్యోతిశ్శాస్త్ర విజ్ఞానం ద్వారా తెలుసుకొనటం సామాన్య శాస్త్రజ్ఞులకు సైతం ఎంతైనా అత్యవసరం.

దుష్ట శక్తులవల్ల భారతీయ ధర్మానికి ఉపప్లవం సంభవించినప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణలకోసం పరమాత్మ మత్స్య, కూర్మాది దశావతారాలను ధరించటం జరిగింది; జరుగుతుంది. అట్టి అవతరణ సమయాలను స్మరించటం ఆస్తికత్వ విషయాలు గాఢ విశ్వాసాన్ని నెలకొల్పటం మొదలైన విశ్వాసాలలో వామన జయంతి, నారసింహ జయంతి, పరశురామ జయంతి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి (జన్మాష్టమి), నరకచతుర్దశి మొదలైన పర్వదినాలు ఏర్పడ్డవి. ఈ అవతారాలు అర్చనాది విధానాలవల్ల భారతీయులకు బహుముఖీనాలైన లౌకిక, దైవిక విజ్ఞానాలు సంప్రాప్తిస్తవి.

భారతీయుల ధర్మశాస్త్రం వారికి దేవ, గురు, పితృ ఋణాలనే ఋణత్రయం ఉన్నట్లు నిర్దేశించింది. వ్యాసభగవానుడు మానవులకు “మనుజ ఋణం" అనే నాల్గవ ఋణం కూడా ఉన్నట్లు భారతం ఆశ్రమవాస పర్వంలో ఒక సందర్భాన ఆదేశించాడు. భారతీయులు వివిధ పర్వదినాల్లో తమ జన్మాదులకు మూలకారణాలైన దేవతల స్వరూపాది విశేషాలను తెలుసుకొని అర్చిస్తూ, వారి దైవ ఋణాలను తీర్చుకుంటారు. ఉపనయనాది సంస్కారాలను ప్రదానం చేసి, లౌకిక దైవిక విజ్ఞానాన్ని ప్రసాదించి వారి జీవితాన్ని తీర్చిదిద్ది నడిపించిన గురువర్యులను పూజించి, వారి గురుఋణాన్ని తీర్చుటకోసం ఏర్పడ్డవే గురుపూర్ణిమ (వ్యాసపూర్ణిమ), శంకర, రామానుజ, మధ్వాచార్యాదుల పుణ్య దినాలు. భారతీయుల దృష్టితో గురువులు బ్రహ్మ


సంస్కృతి

387