ఇత్యాదులతో గూడిన ఉత్తమ సంస్కారోపేత సాంఘిక వ్యవస్థ రూపొందింది. భారతీయుల సర్వ పర్వదినాలలోనూ తాత్త్వికమూ లేదా ఆధ్యాత్మికమూ అయిన, సాంస్కృతిక దృష్టి అభివ్యక్తమౌతుంటుంది. భారతీయుల పరదైవతం, ఉపాసించే వారి ప్రయోజనాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది ముక్కోటి దేవతామూర్తులను ధరిస్తుంటాడు. అనంత వైవిధ్యంతో గోచరించే ఈ మూర్తులకు రూపకల్పన చేసి, అర్చావిధానాన్ని అవగతం గావించేటందుకు అనేకమైన ఆగమ, తంత్ర గ్రంథాలు, గృహ్య శ్రౌత సూత్రాలు, ధర్మ, జ్యోతిష, జన్మాది శాస్త్ర గ్రంథాలు - అనంతమైన దైవ విజ్ఞాన గ్రంథజాలం అవతరించింది. పర్వదినాలలో విశేష ప్రాచుర్యం వహించే దీనిని పరిశీలిస్తే విశ్వ సృష్ట్యాదులను గూర్చిన భారతీయుల భావనావైశద్యం, శిక్షాఛందాదులందు వారు సాధించిన విజ్ఞానం, నృత్య సంగీత శిల్పాదులందు వారార్జించిన నైపుణ్యం, శౌచ సత్యదాన దయాధర్మాదులందలి వారి దృక్పథం మొదలైన వాటిలో వారు ఎంతటి బాహ్యాభ్యంతర సంస్కృతిని సంపాదించారో వ్యక్తమౌతుంది. వసంత నవరాత్రుల్లో కామదేవుడిని, కృష్ణాష్టమినాడు యోగమాయను, వినాయక చతుర్థినాడు గణపతిని, శరన్నవరాత్రులలో ప్రధానంగా సరస్వతీ, లక్ష్మీ, దుర్గలను, ధనుర్మాస దినాల్లో మహావిష్ణువును, శివరాత్రినాడు మహాదేవుణ్ణి, స్కంద షష్ఠినాడు కుమారస్వామిని, రథసప్తమినాడు సూర్యదేవుని - ఈ రీతిగా ఆయా పర్వదినాల్లో ఏయే దైవతాన్ని ఆరాధించినా, ఆయా దేవతలను అందరినీ పరబ్రహ్మమనే భావంతోనే భారతీయులు ఆరాధిస్తారు. షణ్మతాలవారూ వల్లభ చైతన్యప్రభు అనుయాయులయిన వారు పంచాయతన దేవతార్చనగావించే, అద్వైతులు చేసే అర్చనారీతులు ఆయా శాఖ వారి విశ్వాసాలకు చెందిన మానసిక సంస్కృతీవిభేదాలను అభివ్యక్తం చేస్తుంటవి. దత్తాత్రేయ సంప్రదాయులవారు మార్గశీర్షంలో వచ్చే దత్త జయంతి నాడు త్రిమూర్త్యాత్మక రూపుడైన దత్తాత్రేయుని కొలవటం ఈ విధానాన్ని నిరూపించటానికి ఒక చిన్న నిదర్శనం.
రథసప్తమినాడు అర్చింపబడేది సూర్యుడే కాక కార్తికేయ, గణేశాది దేవతలు, ఎందరో జ్యోతిర్గణాలు, నక్షత్రగణాలు. ఆకాశంలో గంగావతరణానికీ, కొన్ని సమయాల్లో విశేషంగా గోచరించే "గంధర్వ నగరాలకూ”, ఇత్యాదులకూ తమ జీవితాలకూ సంబంధం ఉన్నదని ఏ నాడో గుర్తించిన భారతీయులు, అందుకు హేతువులైన నక్షత్ర గణాలనూ, జ్యోతిర్గణాలను వాటి ఉదయాస్తమయాలలో అర్చించటం వారి సాంస్కృతికోన్నతిని వెల్లడి చేస్తున్నది. ఆ నక్షత్ర లక్షణాలకూ, జ్యోతుల గుణ విశేషాలకూ, వానివల్ల రూపొందిన దేవతలకూ ఉన్న సంబంధాన్ని అవగతం చేసుకొని
386
వావిలాల సోమయాజులు సాహిత్యం-4