Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీటిలో గణేశ చతుర్థి, నాగచతుర్థి వంటి పర్వదినాలు వేదోక్త దేవతాకాలు. కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి, శ్రావణ పూర్ణిమలు వంటివి స్మార్తపర్వదినాలు. శరన్నవరాత్రులవంటివి తాంత్రిక పర్వదినాలు. నరక చతుర్దశి, భీష్మ ఏకాదశి వంటివి పౌరాణిక పర్వదినాలు. అందువల్ల ఆయా పర్వదినాలలో ఆయా కాలాలకు చెందిన భారతీయ సంస్కృతి ద్యోతక మౌతుంటుంది. భారతీయ పర్వదినాల్లో సామాన్య ప్రజల నృత్యగీత కేళీ విలాసాదులకే విశేష ప్రాధాన్యం కనిపించే జాతరలు మొదలుకొని, అతి నిగూఢమైన సృష్టి రహస్య విజ్ఞానంతో గూడిన శరన్నవరాత్రుల వంటి తాంత్రికోపాసన వరకూ ఉన్నవి. పర్వదినాల్లో కొన్ని జాతి నిర్మాణాన్నీ, రక్షణనూ, సంక్షేమాన్నీ చేకూర్చిన మహాపురుషుల జన్మస్మృతికి సంబంధించినవి. కొన్ని జ్ఞాన విజ్ఞాన ప్రదాతలైన గురువర్యుల యెడ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ అభినందించేవి. కొన్ని శ్రావణ మంగళవార, శ్రావణ శుక్రవార, మార్గశీర్షంలోని లక్షీవారాల వంటివి సాంఘికోత్సాహ మూలకాలై క్రమశిక్షణాదులను నేర్పి యువకలోకాన్ని భావిజీవితానికి అనుగుణమైన ప్రవర్తనను పొందేవాటిగా పరిణమింపజేసేవి. తొలుత ఏ ఉద్దేశంతో ఏర్పడ్డప్పటికీ నానారీతులైన ఇవి, అంటే ఒక రీతి పర్వదినాలు మరొక పర్వదినాలుగా రెండవ రీతి పర్వదినాల మీద తమ ప్రభావాన్ని నడుపుకుంటూ వచ్చి, అధిక సంఖ్యాకంగా సంఘంలోని సర్వశ్రేణులకూ చెందిన జనసముదాయాన్ని ఆకర్షించేటట్లు రూపొందాయి.

ఖగ చక్ర పరిభ్రమణం వల్ల ప్రకృతిలో కలిగే ఉల్లాసకరాలూ, శుభప్రదాలు అయిన వసంత సౌభాగ్యం, గ్రహోద్ధతి మొదలైన ప్రకృతి శక్తులను ఊహించడంతో భారతీయుల దేవతారాధన ప్రారంభమై ఉంటుంది. అయితే అతి పురాతనమైన అనాదికాలంలోనే, తాత్త్వికులుగానూ, ఆధ్యాత్మిక యోచనాతత్పరులుగానూ పరిణమించిన భారతీయులు చరాచర ప్రకృతి సమస్తం శివశక్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమనీ, సృష్టి స్థితి లయాలనే పరిణామ విపరిణామాలను పొందుతుందనీ, ఆత్మజ్ఞానార్జన చేసి ఆ పరబ్రహ్మమందు లీనం కావటం లేదా ఆ పరబ్రహ్మను అందుకోవటం పరమానందమనీ, మోక్షమనీ, అదే జీవికి చరమలక్ష్యమనీ నిర్దేశించుకొన్నారు. సత్, చిత్, ఆనందస్వరూపమైన యీ పరబ్రహ్మాన్ని ఖగోళ విజ్ఞానం మూలంగా బహురూపాల్లోనూ, ఇష్టదేవతామూర్తులుగాను వీక్షించి ఉపాసించటం (అర్చించటం, పూజించటం) కోసమే పర్వదినాలను నిర్దేశించి నిబద్ధం చేసుకొన్నారు.

ఇందుకు అనుగుణంగా చతుర్విధ పురుషార్థ వివేకం, చతురాశ్రమాదుల పరిచయం, యోగాది విద్యాపరిజ్ఞానం, శిల్ప నాట్య సంగీతాది కళానైపుణ్య సంపాదన


సంస్కృతి

385