పర్వదినాలు - సంస్కృతి
ఒక జాతి సంస్కృతిని ప్రతిబింబింపజేసే అంశాలలో పర్వదినాలు పరమ ప్రాధాన్యాన్ని వహిస్తున్నవనటంలో ఎట్టి అతిశయోక్తీ లేదు. భారతీయుల పర్వదినాలు వారి అత్యంత పౌరాతన్యమూ, అతి విశిష్టమూ అయిన సంస్కృతిని సర్వతోముఖం గానూ, సమగ్రంగానూ ప్రదర్శిస్తున్నవి. మన ప్రాచీన మహర్షులు, భారతదేశీయమైన భౌగోళికైక్యతను దర్శించిననాడే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, భారతీయులను అందరినీ ఏకజాతిగా తీర్చటంలో ఈ పర్వదినాలను ఒక ప్రముఖ సాధనంగా చేసుకున్నారు. భారతీయుల పర్వదినాలలో ప్రతి ఒక్కటీ వారి సంస్కృతిని ప్రతిబింబించే ఒక ఘన దర్పణం. "పర్వదినాలకు సంబంధించిన విజ్ఞానమంటే అది సర్వ సంస్కృతి విజ్ఞానం” అని అనటంలో ఎట్టి అనుపపత్తీ ఉండదు.
పరదేవతారాధానమే పరమ లక్ష్యంగా పెట్టుకున్న వారై, అన్నిటినీ దానితో అనుబంధించుకున్న భారతీయులకు చెందిన సంవత్సరంలో, పర్వదినం ఒక్కటైనా లేని మాసమంటూ లేదు. చైత్రంలో ఉగాది, వసంత నవరాత్రాలూ, కామోత్సవాలు, శ్రీరామ నవమి - వైశాఖంలో పరశురామజయంతి, శంకర జయంతి, విద్యారణ్య జయంతి, నృసింహ జయంతి, జ్యేష్ఠంలో గంగావతరణాలు - ఆషాఢంలో కర్కాటక సంక్రమణం, వ్యాసపూర్ణిమ (గురుపూజ) - శ్రావణంలో ఉపాకర్మ, శుక్రవార వ్రతాదులు భాద్రపదంలో గణపతి నవరాత్రులు, (ఇంద్రద్వాదశి: భాద్రపదశుద్ధంలో) మహాలయామావాస్య - ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి - కార్తికంలో నక్తవ్రతాలు, నాగచతుర్థి - మార్గశీర్షంలో లక్ష్మీవారాలు, సుబ్రహ్మణ్య షష్ఠి, దత్తజయంతి - పుష్యంలో మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం మాఘంలో రథ సప్తమి, శివరాత్రి - ఫాల్గునంలో కామదహనాదులు, ఇత్యాదులయిన పర్వదినాలతో భారతీయుల సంవత్సరం చక్రీభూతంగా వివరించుకొని ఉంది.
ఈ పర్వదినాల్లో భారతీయ చారిత్రక దినాల్లో ఏర్పడ్డ శంకరాచార్య జయంతి, విద్యారణ్య భారతీ జయంతి వంటివి కొన్ని తప్ప ఇతరాలైనవన్నీ ఎంతో పురాతనమైనవి. కేరళ దేశంలో మాత్రమే కనుపించే “ఓణం” వంటి కొద్ది పర్వదినాలు తప్ప మిగిలినవన్నీ ఆసేతుశీతాచలం ఒకేరీతిగా ఆచరించే పర్వదినాలే. కనుక ఇవి అన్నీ భారతదేశీయాలే.
384
వావిలాల సోమయాజులు సాహిత్యం-4