మూలమని కొందరి అభిప్రాయం. ఆ రాజన్యుడు విక్రమాదిత్యుడూ, గుప్త వంశస్థుడూ, ముఖ్యపట్టణము ఉజ్జయినీ, నూతన శకారంభం వీటినిబట్టి ఈ విధంగా ఊహించటానికి అవకాశం లేకపోలేదు.
దీపావళి శబ్దానికి దీపపు వరుస అని గానీ, సమూహము అని గానీ అర్థం చెప్పవచ్చును. ఈ పండుగ లక్ష్మీదేవి (ఐశ్వర్యాధిదేవత) లేదా భవానీ దేవి ఆధిక్యమును నిరూపించటానికి ఏర్పడ్డ పండుగగా కనిపిస్తుంది.
పూర్వం ప్రాగ్జ్యోతిషాధిపతి అయిన నరకుడు వరమాహాత్మ్యం వల్ల ఇంద్రపదవిని పొంది ముల్లోకాలనూ చీకాకు పరచినప్పుడు, శ్రీకృష్ణుడు ఇంద్రాది దేవతల మొరవిని అతనితో యుద్ధం చేసి, అతణ్ణి రూపుమాపి అతని చెరలో ఉన్న పదహారు వేలమంది గోపికలనూ విడిపించి వివాహమాడినట్లునూ, అతని విజయసూచకంగా దీపావళీ మహోత్సవాలు జరుగుతున్నట్లు పురాణాలవల్ల తెలుస్తున్నది.
వంగ దేశస్థులు ఈ పండగను దుర్గాపూజ, కాళీపూజ అని వ్యవహరిస్తారు. అర్ధరాత్రి వేళ ఆ దేశస్థులు గృహద్వారతోరణాలనూ, నదీతీరాలనూ, దీపావళులు వెలిగించి పూజ చేస్తారు. ఈ సందర్భంలో వారు పూజించే దేవత కాళరాత్రి మహామాయ. మార్కండేయ పురాణంలోని దేవీమహాత్మ్యంలో ఈ శక్తిని గురించి 'కాళరాత్రి ర్మహారాత్రి శ్చ దారుణా' అని చెప్పి ఉంది. ఇతర పుస్తకాలలో 'దీపావళి తయా ప్రోక్తా కాళరాత్రిస్తు సా మతా' అని కనిపిస్తున్నది. దీపావళి నాటి రాత్రి మహారాత్రి కాళరాత్రి. ఆ నాటి పగలు కాలవేలము లేదా వారవేలము. వ్యాపారస్థులు కొత్త చిట్టాలు ప్రారంభిస్తూ, అతిశయమైన వైభవంతో పూజాపునస్కారాలూ, గృహాలంకరణలూ జరుపుతారు; వారిలో కొందరు కొద్ది రోజులల్లోనే 'దివాలా' తీస్తారు. అందువల్ల ఒక ఉర్దూకవి 'ఐసీ ఆయీ థీ దివాలీ కి దివాలా నికాలా' అని చమత్కరించాడు.
నరకాసుర వధ వంటి పౌరాణిక గాథలు కొన్ని కనిపిస్తున్నా దీపావళికి విశేషమైన మతసంబంధము గానీ, తాంత్రిక సంబంధము గానీ కనిపించటం లేదు. అందువల్ల దీనిని కొందరు అతి ఆధునికమైన పండుగగా భావిస్తున్నారు. దీపావళి ముఖ్యంగా సూర్యగమనంలో కలిగిన ఒక మార్పును సూచిస్తున్నది. ఈ నాడు ఆ గ్రహరాజు తులారాశి (Libra) లో ప్రవేశిస్తున్నాడు. బార్హస్పత్య మానాన్ని అనుసరించే ఔత్తరాహులకు కార్తిక ప్రతిపత్తునాటితో నూతన సంవత్సరం ఆరంభిస్తుంది. ____________________________________________________________________________________________________
340
వావిలాల సోమయాజులు సాహిత్యం-4