Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీపావళి

ఆశ్వయుజ మాసం శరన్నవరాత్రులతో ప్రారంభిస్తుంది. అంతటా దీపావళి మహోత్సవాలు జరుగుతవి. భారతదేశంలో సమస్తజనం సంతోషంతో పాల్గొనే పండుగల్లో దీపావళి ఒకటి. అతిముఖ్యమైనదని కూడా చెప్పవచ్చును. ఒక కవీంద్రు డన్నట్లు.

      సీ. "ఒక దివ్వె వెలుగంగ నుజ్జ్వలంబయి భార
                    తీ దివ్యరేఖ దీప్తించెననగ,
           ఒక సంచు మ్రోయగా నుత్తమ భారతి
                    జయభేరి మ్రోగిన సరణిదోప,
            ఒక చిచ్చుబుడ్డి యాగక ముత్యముల్ చిమ్మ
                    భారత రత్నముల్ ప్రబలెననగ,
            ఒక చువ్వ మింటికి సెక దీసికొని పోవ
                     భరతశోభలు మిన్ను ప్రాకెననగ,

      తే.గీ. అన్ని యొకమారు తోపగానన్ని యొక్క
            మారుతోచినయట్లయి మారుమ్రోగ
            భరతవర్షంపు గీరితి పరిఢవిల్ల
            వెలుగు దీపావళీ దివ్య విభవ మవని.”

భారతదేశ కీర్తివ్యాపకాలైన మహోత్సవాలలో దీపావళికి అగ్రస్థానం.

దీపావళి అతి ప్రాచీనమైన పండుగ. మధ్యయుగంలో వచ్చింది కాదు. ఈ పండుగకు సంబంధించి జనశ్రుతిలోనూ, భాగవతాది పురాణాలల్లోనూ కొన్ని కథలు కనిపిస్తున్నవి. ధర్మసంస్థాపనార్థం ఉజ్జయినీసంస్థాన సింహాసనాన్ని విక్రమాదిత్య గుప్తుడు ఆశ్వయుజ మాసంలో దీపావళినాడు అధిష్ఠించినాడని చరిత్రజ్ఞులంటున్నారు. ఆ నాటినుంచి విక్రమశకం ప్రారంభించింది. అందువల్ల ఆ నాటి విదేశీయ సంప్రదాయాలకూ, క్రూరయాతనలకూ, పరిపాలనకూ తల వొగ్గి బాధపడలేక బయటపడిన భారతీయ ప్రజ, ఆనందంతో ఎత్తిన దీపహారతులే నేటి దీపావళికి


సంస్కృతి

339