Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారిజాతుల్లోనైనా జరుగుతుంటుంది. బ్రెజిలు మొదలైన దక్షిణ అమెరికా దేశాలలో వివాహం కోసం యుద్ధాలు జరుగుతవని ప్రపంచ చరిత్రకారుడు నెస్టర్ మార్కు అభిప్రాయము. ఇవి కేవలమూ కన్యకల కోసమే కాదు, వరులకోసం కూడా జరుగుతూ ఉంటవి. కొన్ని జాతుల్లో స్త్రీ జనసంఖ్య అధికంగా ఉంటుంది. అప్పుడు వారు ఇతర జాతులమీద పడి పురుషులను ఎత్తుకోపోయి వివాహమాడుతుంటారు. కాలిఫోర్నియా, లూషియానాలలో ఇండియను జాతులు పెళ్ళికుమార్తె యింటిమీద దండెత్తుతవి. ఈశాన్య ఆసియాలో చుకిచీ జాతి యువకుడు పిల్ల కాళ్ళు చేతులు కట్టివేసి బంధించి తెచ్చి వివాహం చేసుకుంటాడు. తల్లిదండ్రులు వచ్చి వారికి రావలసిన శుల్కం పుచ్చుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.

రష్యాలోని సాహోయన్, జిటాయల్, ఒష్టాయల్ జాతుల్లో వరులు వధువును బలాత్కరించి తెచ్చుకుంటారు. ఆమె అంగీకరింపక పోయినా, ఆమె తల్లిదండ్రులు అంగీకరింపకపోయినా ప్రయోజనం లేదు. కన్య ఒకదినం అతని పర్ణకుటిలో పవ్వళిస్తే చాలు, అతని భార్య ఐపోతుంది. ఇతరులు వివాహం చేసుకోటానికి అంగీకరించరు కూడాను. మలై అర్చిపెలగోలోనూ, మలనీషియాలోనూ, ఆస్ట్రేలియాలోనూ రాక్షస వివాహమే నేటికీ చాలాచోట్ల ఆచారము. మహమ్మదు పుట్టుకకు పూర్వం అరబ్బు సైనికులు రాక్షస వివాహం అడవచ్చునని వారి ధర్మశాస్త్రం అంగీకరించిందట. స్కాండినేవియా జాతుల్లో భార్యలకోసం నిరంతరమూ యుద్ధాలేనట. కొసక్, యుక్రీనియన్ జాతుల్లో కన్య దూషణ చేసిన వానిదే.

టుటానిక్ జాతుల ధర్మశాస్త్రం 'రాక్షస వివాహం' అధర్మమైనది; న్యాయసమ్మతము కాదని చెప్పింది. అటువంటి వారిని శిక్షిస్తుంది; కానీ ఒకానొక వైవాహికవిధానంగా దానిని అంగీకరించింది. తూర్పు ఆఫ్రికాలో యువకుడు కన్యక ఇంటిమీదికి కత్తికటారులతో వెళ్ళి అడ్డగించిన ఆమె అన్నదమ్ములతో పోట్లాడి, ఆమెను తెచ్చుకొని బలాత్కారంగా వివాహమాడుతాడు. మంగోలు జాతుల్లోనూ, మొరాకోలోనూ ఇదే ఆచారం. బర్మా జాతుల్లోనూ ఇటువంటి వివాహాలు ఒకానొక కాలంలో వున్నట్లు నేటి వైవాహికాచారాలలో కనిపించే ఉట్టుట్టి పోరాటాలవల్ల వ్యక్తమవుతున్నదని సాంఘిక శాస్త్రవేత్తలంటున్నారు.

నేటి రోమను కన్యక తల్లి ఒడిలోకి పారిపోతుంది. పెళ్ళికుమార్తెను చేసిన తరువాత వివాహ మాడనని చర్చికి పారిపోతుంటే పెళ్ళికుమారుడు స్నేహితులతోనూ, బంధువులతోనూ మళ్ళీ బలాత్కరించి తీసుకోవస్తాడు. జర్మనీదేశంలో పెళ్ళికుమార్తెను

______________________________________________________________________________________

సంస్కృతి

259