Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థితిలో రాక్షస వివాహము ఒకానొక అవస్థాభేదాన్ని నిరూపిస్తున్నది. ఈ వివాహ విధానంలో ఒక జాతికి చెందిన యువకుడు మిత్రబృందంతో పర జాతి కన్యకను బలాత్కరించి ఎత్తుకుపోతుంటాడు. కొంతకాలం వారి మిత్రులందరూ కన్యకను వంతుల ప్రకారం అనుభవిస్తారు. చిట్టచివరకు ఆమె మొదట ప్రేరేపించినవానికి భార్య ఔతుంది. కన్యక అతణ్ణి అంగీకరించక ఆ స్నేహితులబృందంలో మరి ఒకరిని భర్తగా కోరుకొని అతని వెంట పారిపోతే, అతని భార్య ఔతుంది. మొట్టమొదటివాడికి ఎత్తుకోరావటం వల్ల కలిగే హక్కులన్నీ పోతవి. గుంపుపెళ్ళి (Group-Marriage) సర్వసామాన్య లక్షణంగా మానవజాతి వైవాహిక విధానం నడుస్తూ ఉన్న దినాలలో ఈ విధానం అమలులోకి వచ్చి ఉంటుంది. బలాత్కారంగా యుద్ధసమయాలలో జితులైనవారి భార్యలనూ, కుమార్తెలనూ ఎత్తుకొని వచ్చి భార్యలుగా స్వీకరించటం గానీ, ఉంపుడుకత్తెలుగా నిలుపుకోవటం గానీ ఈ వివాహ విధానానికి లక్షణము అని నిరూపించాడు.

ఇటువంటి వివాహాలు ఇంగ్లండు దేశంలో ఏడవ హెన్రీ రాజ్యకాలంవరకూ పరిపాటిగా వస్తూనే ఉండేవట. అతడు రాజ్యంచేస్తూ ఉన్నప్పుడు రాజ్యార్హత కలిగిన రాజకుమార్తెను ఒక వ్యక్తి రాక్షస వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఇది తప్పిదంగానూ, న్యాయవిరుద్ధ వివాహంగానూ ఏర్పాటైంది. ఐర్లాండు దేశంలో పూర్వపిక్టులకూ గాలులుకూ జరిగిన యుద్ధాలు రాక్షస వివాహ మూలాలే. ఇటలీలో ఈ ఆచారం మధ్యయుగంలో కూడా ఉండేది. అందుకోసమని ధనిక కుటుంబికులు వారి కన్యకలను రక్షించుకోటానికని కొంతమంది వీరులను (Knights) నియమించేవాళ్ళు. మరొక వీరుడు ఆ ధనిక కుమార్తె రూపరేఖావిలాసాలకు ముగ్ధుడై బలాత్కరించి రాక్షస వివాహం చేసుకోదలచుకుంటే, ఆమెకు రక్షకుడుగా ఉంటూ ఉన్న వీరుడితో యుద్ధం చేసి జయించవలసి ఉంటుంది. యుద్ధంలో కన్యక వీరుడు ఓడిపోతే ఆమె ప్రతివీరుడికి భార్యగా పరిణమించక తప్పదు. పురాతన గ్రీసులోనూ ఇంతే.

దక్షిణాస్లావ్ జాతుల్లో ఈ ఆచారం 18 శతాబ్దం వరకూ ఆచారంగానే ఉంది. ఆల్బేనియా పర్వతప్రాంత జాతుల్లో నేడూ ఇదే ఆచారం. వీరు కొండజాతులు, మైదానంలో నివసించి జాతులు ఊర్లమీద పడి వివాహితలనూ, అవివాహితలనూ ఎత్తుకొనిపోయి దూషణానంతరం (Rape) వివాహం చేసుకోవటం వారి ఆచారం.

యహగన్లూ, ఓనస్ జాతివారూ పరాయి పిల్లలకోసం వారితో యుద్ధాలు చేసి శక్తిని ప్రకటించి ఎత్తుకోపోతారట. ఇటువంటి పని శాంతి సమయాలలో

________________________________________________________________________________________

258

వావిలాల సోమయాజులు సాహిత్యం-4