Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వివాహ వయస్సుకు నిర్ణయం ప్రధాన సూత్రాలలో సంతానం ఒకటి, వయస్సు మీరిన కొద్దీ సంతానాన్ని పొందటం కష్టం. వయస్సు మించిన కొద్దీ స్త్రీలలో ముఖ్యంగా, కొంత స్తబ్ధత (Frigidity) ఏర్పడుతుంది. అందువల్ల ముప్పది ఏండ్లు దాటిన స్త్రీ సంతానాన్ని పొందటానికి ఎంతో బాధపడవలసి ఉంటుంది. యౌవనారంభంలో ఉన్న వ్యక్తికి శరీరాపాయం లేకుండా సంతానం కలుగుతుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. యౌవనారంభం అయిన తరువాత వయస్సు ఎంతగా పెరగకపోతే సంతానాన్ని అంతే సుకరంగా పొందవచ్చునన్నమాట.

పేటక్, మాక్సు క్రిస్టియన్ వంటి సంతాన శాస్త్రజ్ఞులు పురుషుడు 25వ ఏట, అంతకంటే కొంత వయస్సు తక్కువలో స్త్రీ వివాహం చేసుకోవటం యుక్తమన్నారు. అనేక కారణాల చేత కొద్ది వయస్సులలో వివాహం చేయటం పనికిరాదని పాశ్చాత్య లోకాలలో శాస్త్రజ్ఞులు పలుకుతున్నారు. వారు చెప్పే ముఖ్య కారణాలను పరిశీలించవలసి ఉంటుంది. ఆధునిక స్త్రీ పురుషునితో సమాన స్వేచ్ఛనూ, ప్రాతినిధ్యాన్నీ వహిస్తున్నది. అందువల్ల ఆమెకూ ప్రత్యేక వ్యక్తిత్వమున్నది. ఆ కారణం మూలంగా వెనకటి వలె వివాహ నిర్ణయ విషయంలో పురుషునికి వలె ఆమెకూ ప్రధాన స్థితి ఉన్నది. ఆమెకు వయస్సు అభివృద్ధి అవుతున్న కొద్దీ అనేకులతో పరిచయం కలిగించుకునే అవకాశం లభిస్తుంది. ఆ పరిచయస్థులలో ఎవరితో ఆమె వైవాహిక జీవనము సంతృప్తికరంగా ఉంటుందో నిర్ణయించుకునే అవకాశం ఆమెకు లభింపజేయటం అత్యవసరం కనుక, కన్యకగా ఉన్నప్పుడే ఇక వివాహం పొసగదని వీరి అభిప్రాయం.

రెండవ కారణం విద్యాసంబంధమైనది. భవిష్యద్గృహకృత్యాలను సమర్థతతో సరిదిద్దుకోదగిన విద్య, కాలానుగుణమైన విజ్ఞానం పొందటానికి యుక్తమైన వయస్సు ప్రాచీనకాలం కంటే విశేషంగా కావలసి ఉంది. అందువల్ల కూడా వైవాహిక వయస్సు తప్పకుండా అభివృద్ధి పొందవలసిన అగత్యం కనిపిస్తున్నదని వారి నిశ్చయము. ఇందుమూలంగా పురుషుని వైవాహిక వయస్సు కూడా పెరిగి కావలసిన ధనాదికాన్ని సంపాదించి వైవాహిక జీవనాన్ని సుఖప్రదం చేసుకునే అవకాశాన్ని అతడూ పొందగలుగుతాడు. ఇటువంటి అవకాశాలు లేకపోతే జీవిత సహపథికులుగా ఉండి పవిత్ర జీవయాత్ర సాగిద్దామనుకుంటే భార్యాభర్తలిద్దరూ నిరాశను పొందుతుంటారు. సంసార బాధ్యతలతో భర్త ఆర్థిక ప్రతిపత్తికోసం పాకులాడుతుంటే, భార్య ఏకాంత జీవనం గడుపుతూనో, లేక ఆమె కూడా ఆర్జనకు పూనుకోవలసి ఉండటం వల్లనో వైవాహిక జీవనం అసంతృప్తికర మౌతుందని వారి అభిప్రాయము. ____________________________________________________________________________________________________

250

వావిలాల సోమయాజులు సాహిత్యం-4