వివాహము - వయస్సు
వైవాహిక సమస్యలలో వయోనిర్ణయం ఒకటి. అది ఏ ఒక ప్రత్యేక కారణంమీదా ఆధారపడి ఉండదు. ముఖ్యంగా దేశము, కాలము, వృత్తి, ఆర్థిక వ్యవస్థ, వ్యక్తుల గుణగణాలను బట్టి ఈ సమస్య నిర్ధారణ చేయవలసి ఉన్నది.
కొన్ని దేశాలలోనూ, జాతుల్లోనూ భార్యలు దొరకటం చాలా కష్టము. కొన్ని దేశాలు కేవలం 'కన్యావివాహాలు' పరమ పవిత్రాలుగా భావిస్తుంటవి. అటువంటి సందర్భాలలో వయస్సు ఈ లక్షణాలను అనుసరించి దేశకాలపాత్రలుగా నిరూపితమౌతుంది. బగండా జాతిలో బహుపత్నీత్వవిధానం అమలులో ఉంది. స్త్రీపురుష జన సంఖ్య 31/2 :1X ఉన్నా యువకులకు భార్యలు దొరకటం కష్టమట. అందువల్ల ఆ జాతివారు కన్యకను చౌకగా కొనవచ్చుననే ఉద్దేశంతో కన్యా వివాహాలు చేస్తారు. అందువల్ల కన్యాత్వం దూషితము కాకపోవటము వధూవరులు ఉభయవంశాల పరస్పర మైత్రి అభివృద్ధి అకృత్రిమంగా పెంపొందించుకోటానికి అవకాశం ఉంటుంది. కొన్ని సెమిటిక్ జాతుల్లో 18 ఏళ్లు దాటిన పురుషుణ్ణి భార్యను చూచుకోమని న్యాయస్థానం ఒత్తిడి చేస్తుందట. అటువంటి నిర్ణయము స్త్రీ విషయంలో 13వ సంవత్సరానికే ప్రారంభిస్తుంది.
కన్యావివాహాలు పనికిరావనే వారు వారికి ప్రథమంలో వివేచనజ్ఞానం ఉండని కాలంలో వివాహం జరిగి, తరువాత రజస్వలలై భర్తగృహంలో నూతన గృహస్థితులతో విసుగు చెందుతుంటారు. అది భవిష్యద్వైవాహిక జీవనానికి భంగం కలిగిస్తుందని - అభిప్రాయపడ్డారు. యౌవనారంభంలో వివాహం జరిగితే ఆ వయస్సులో స్త్రీ పురుషుల మనస్సులు కొంత పరిపక్వతను పొంది ఉండడం ఒకరినొకరు అవగతం చేసుకొనగలుగుతారు; అందువల్ల వైవాహిక జీవితంలో అన్యోన్యత ఉంటుందని వారంటారు. యౌవనారంభంలో జరిగే వివాహాలలో కేవలం జాత్యాకర్షణ (Sexual attraction)కు మాత్రమే ప్రధాన స్థితి లభిస్తుందనీ, పరిపూర్ణమైన మానసిక ఉద్వేగాదికాలను గురించి ఉద్యద్యౌవనంలో ఉన్నవారు ఆలోచించరనీ వీరిని కొందరు ఖండించకపోనూ లేదు. ____________________________________________________________________________________________________
సంస్కృతి
249