పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విజయవంతంగా ఉన్నవనుకునే వివాహ బంధాలు కలిగిన భార్యాభర్తలను స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని కల్పించినా, వారిలో ప్రతి ఒక్కరూ రెండవ వారిలో కామోద్వేగం తక్కువని చెపుతారని వాకర్ అనే మహాశయుడన్నాడు. ఇటువంటి సామ్యఆహిత్యాన్ని తీర్చి ఆ వివాహాలను పరిపూర్ణంగా విజయవంతం చేసేమార్గమే లేదు. అయితే మానసిక సామ్యంవల్ల ఈ కొద్ది లోపాలను దంపతులు లెక్కచేయరు. ఇటువంటి లోపాలు కూడా లేకుండా చేయటానికి కొందరు వివాహ పూర్వ ప్రణయ సంయోగము మంచిదని అభిప్రాయపడ్డారు. కానీ దానివల్ల అనేక లోపాలు కూడా సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు నిర్ణయిస్తున్నారు.

వైవాహిక జీవనం కొంతకాలం సక్రమంగా సాగిన తరువాత స్త్రీ పురుషులలోని మాతృ పితృత్వ లక్షణాలు బహిర్గతమౌటం వల్ల కూడా తరువాత వివాహచ్ఛిద్రాలు బయలు దేరుతుంటవి. కేవలం సంయోగాసక్తి ఉన్న పురుషుడు (Phallic Type) పిల్లలమీద మమకారం ఉన్న స్త్రీని (UterineType) వివాహం చేసుకోవటంవల్ల ఆమెకు సంసారాసక్తి అతనికి కామేచ్ఛ అధికం కావటం జరుగుతుంది. అదేరీతిగా కామాసక్త (Clitoroid Type) కూ సంసారాసక్తునికీ (Orchitic Type) వివాహం జరిగినా కొంతకాలం తీరిన తరువాత అపజయాన్ని తప్పక పొందుతుంది. ఈ దంపతులలో స్త్రీ పురుషులు ఇద్దరూ కామాసక్తులైనప్పుడు పర పురుష దారాభిగమనాలు తప్పవు. అందువల్ల వైవాహిక జీవనంలో కామచిహ్నాలూ, మాతా పితృత్వ చిహ్నాలూ, దంపతులలో సరిసమానంగా ఉండటము అత్యవసరము. నేడు విశేషంగా అవతరిస్తున్న కృత్రిమ సాధనాలు (Contraceptives) మూలంగా స్త్రీ పురుషుని కోరికకు భిన్నంగా శారీరక సౌఖ్యాన్ని పొందటానికీ, భార్య అత్యధికంగా ప్రేమించే సంతానం కలుగకుండా పితృత్వం వహించదలచుకోకపోవటం వల్ల పురుషుడు కేవలం కామాన్ని తీర్చుకోటానికే అవకాశాలు ఏర్పడుతున్నవి. బిడ్డల పోషణను చేయదలచుకోక ఇద్దరూ ఏకగ్రీవంగా కృత్రిమ సాధనాలను ఉపయోగిస్తే తప్ప, లేకపోతే కొన్ని సందర్భాలలో ఈ సాధనాలే వైవాహిక జీవనాన్ని భగ్నం చేయగలవనటంలో సందేహం లేదు. సంయోగ నాటకంలో కొన్ని తడవలు పొత్తు కలియక పోటానికి భార్య కూడా కారణమౌతుంటుంది. ఆమె తెలివిగలదైతే తనకేమి కావాలో భర్తకు చెప్పటమే కాకుండా, అతనిలో నిద్రిస్తూ ఉన్న శక్తిని ఉన్నిద్రం చేయగలిగలినదై ఉంటుంది. కానీ అటువంటి సందర్భాలలో ఆమె అతనికి గురుత్వము నెరపుతున్నట్లు తెలియకుండానే జరిగించాలి.

సంస్కృతి

245