పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈ స్తబ్ధతకు వ్యతిరిక్తమైన కామోద్వేగము (Hyper aesthesia) కారణముగాను కొన్ని వివాహాలు విజయవంతాలు కాలేకపోతున్నవి. సహజమైన కామాన్ని బహిర్గతం చేయకుండా ప్రాచీనులు ఏర్పరచిన నిబంధనలు భంగ్యంతరంగా కామోద్వేగానికి కారణాలుగా పరిణమించినవి. ఈ ఉద్వేగము అధికమైనప్పుడు ఉన్మాదంగా పరిణమిస్తుంది (Sexual Neurosis). ఆవిష్కరణాది (Fetishism) అసహజలక్షణాలు (Abnormalities) వల్ల ఏర్పడుతుంటవి. ఈ విధమైన ఉన్మాదం వల్ల వివాహ బంధానికి కొన్ని ఆటంకాలు కలుగుతున్నవి. ఇటువంటి స్థితి నాగరిక జాతుల్లో కనుపించదు. నాగరికులలో కొంతకాలం ఏకపత్నీత్వమనో, పాతివ్రత్యమనో మనస్సులో దాగి ఉండి కాలక్రమేణ బయటపడతవి. వైవాహికమైన ఆనందాన్ని ఒక మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడు పదునాలుగు శ్రేణులుగా విభజించాడు. అతడు పరిశీలించిన నూరు వివాహములలో ఏబది ఐదుమంది భార్యలు భర్తల వైవాహిక జీవితం సహజంగా ఉంటుందనీ, నలుబది ఒక్కమంది భర్తలు వారికి వైవాహికానంద మిచ్చే సుఖం సంపాదించుకోలేరనీ, అందులో ఇరువది ఒక్కమంది భర్తలు దుర్బలులనీ సమాధాన మిచ్చారట. 'వెయ్యి వివాహాలు’ అనే గ్రంథంలో డికిన్సన్ తారాబీమ్ మహాశయులు ప్రతిముగ్గురు స్త్రీలలోనూ ఒకతెకు మాత్రమే శారీరకానందము కలుగుతున్నదని వ్రాశారు. టెర్మక్ అను శాస్త్రజ్ఞుడును ఇట్టి అభిప్రాయమును వెలిబుచ్చినాడు. వీటి ననుసరించి కెన్నెత్ వాకర్ తన 'నాగరికతా పరిణామము’ (Changes in Civilization) అనే గ్రంథంలో, అసంతృప్తలైన స్త్రీలు వివాహ జీవనమంటే కాలక్రమాన అయిష్టత వహించి పరపురుషాభిలాష చేస్తారని చెప్పాడు.

వైవాహికమైన అపజయానికి నపుంసకత్వం ఒక కారణం. ఇది 90% మానసిక దౌర్బల్యము; మిగిలినది మాత్రమే శారీరకము. దీనికి పెంపకము కారణము. సంఘమూ, సంసారమూ కామాన్ని ఒక పెనుభూతంగా నిరూపించి చూపటమూ, అపవిత్రకర్మగా బోధించటమూ జరిగిన తరుణంలో వివాహం జరిగితే, వైవాహిక జీవనం చెయ్యటానికి తగిన శక్తి వ్యక్తులలో నిద్రితమౌతుంది. వారిని జాతిశాస్త్రజ్ఞులు ఊనకాములు అని అన్నారు. ఊనకామి వైవాహిక కామాన్నీ వ్యభిచారంగా భావించటం అనే అనుమానానికి తావిస్తుంది. అందువల్ల కామోద్వేగము కాని, నపుంసకత్వముగానీ కలుగవచ్చుననీ స్త్రీల జాతిస్వరూపానభిజ్ఞత, కామభీరుత్వము, కామేహ్యత (Disgust) కలుగవచ్చుననీ ఔస్పెన్స్కీ అనే ఒకానొక జాతి శాస్త్రజ్ఞుడు అభిప్రాయమిచ్చాడు. ఇటువంటి మానసికత్వాన్ని మానసిక వైద్యం మూలంగా నయం చేసుకొని వైవాహిక జీవనాన్ని సుఖప్రదం చేసుకోవచ్చునని విజ్ఞుల అభిప్రాయం. ____________________________________________________________________________________________________

244

వావిలాల సోమయాజులు సాహిత్యం-4